ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్​మార్టానికి 9 వేలు వసూలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఫోన్​ రీచార్జీకి  200 కావాలని తల్లిని అడగ్గా తన దగ్గర లేవని చెప్పడంతో మనస్తాపంతో ఓ కొడుకు ఉరేసుకున్నాడు. అయితే మృతదేహాన్ని పోస్ట్​మార్టం కోసం మెడికల్​ కాలేజీకి అనుబంధంగా ఉన్న సర్కారు దవాఖాన మార్చురీకి తీసుకువెళ్లగా అక్కడి సిబ్బంది రూ.9 వేలు వసూలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్​మీడియాలో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఎడవల్లి సురేందర్​(25) ఫోన్​రీచార్జీ చేయించాలని తన తల్లిని రూ. 200 అడిగారు. కూలి పనిచేసుకునే ఆమె తన దగ్గర లేవని చెప్పడంతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అతడిని అశ్వారావుపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్​కు, అక్కడి నుంచి కొత్తగూడెంలోని మెడికల్​ కాలేజీకి అనుబంధంగా ఉన్న గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు. పరిస్థితి విషమించి సురేందర్​చనిపోయాడు. 

పైసలిస్తే గాని చేసేది లేదన్నరు

సురేందర్​ మృత దేహానికి గురువారం పోస్ట్​మార్టం చేయాల్సి ఉండగా, రూ.9వేలు ఇస్తేనే చేస్తామని పోస్ట్​మార్టం అసిస్టెంట్​ హరిరాం, ఔట్​సోర్సింగ్ ​ఎంఎన్​ఓ నాగరాజు డిమాండ్​ చేశారు. తాను పేదదాన్నని అంత ఇచ్చుకోలేనని వేడుకున్నా వినలేదు. శవాన్ని లోపలే పెట్టి రూమ్​కు తాళం వేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో మృతుడి బంధువులు, స్నేహితులు చందాలు పోగేసుకుని పోస్ట్​మార్టం చేసే వ్యక్తికి రూ. 3వేలు, చాప, డబ్బాలు, ఇతర సామగ్రికి రూ.1500, రూం క్లీనింగ్​కు రూ. 500, ఫొటోలు తీసిన వ్యక్తికి రూ. వెయ్యి, ఇతర ఖర్చులకు రూ. 3వేలను ఇచ్చారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు మరో రూ. 5వేలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. సిబ్బంది డబ్బులడుగుతుండగా వీడియో తీసి సూపరింటెండెంట్​కు పంపించినా స్పందన లేదని,  ఫోన్​ చేసినా లిఫ్ట్​ చేయలేదని సురేందర్ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులను ఉద్యోగంలోంచి తొలగించామని సూపరింటెండెంట్​ డాక్టర్​ కుమారస్వామి తెలిపారు. తనకు వీడియోలు పంపించింది నిజమేనని, రాత్రి వేళ కావడంతో తెల్లారిన తర్వాత విచారణ జరిపి చర్యలు తీసుకున్నామన్నారు