పెళ్లి బరాత్ చూస్తుండగా .. కారు డోర్ విండోలో మెడ ఇరుక్కుని చిన్నారి మృతి

సూర్యపేట జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.  బొజ్జగూడెం గ్రామంలో పెళ్లి జరుగుతుండగా  పెళ్లి వేడుకల్లో జరుగుతున్న బరాత్ ను  చూసేందుకు బాణోతు ఇంద్రజ(9) అనే చిన్నారి కారు కిటీకిలో నుంచి తల బయటకు పెట్టింది. 

అయితే డ్రైవర్ శేఖర్‌‌ దీనిని గమనించకుండా కారు విండో గ్లాస్ ను  పైకి ఎత్తాడు. దీంతో అందులో చిన్నారి మెడ ఇరుకోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారి మృతితో పెళ్లి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.  

చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. చిన్నారితండ్రి బాణోతు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు డ్రైవరు శేఖర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.