దొంగతనం చేసే వారు ఏదో ఒక రోజు పట్టుబడక తప్పదు. మనం ఇంతవరకు ఎన్నో దొంగతనాలు చూసి ఉంటాం. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన వస్తువులు, సొమ్మును పక్కదారి పట్టించి.. జేబులు నింపుకుంటారు. ఇలా కోట్లకు కోట్లు కొట్టేసి.. చివరికి ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారు. ఇప్పుడు చికెన్ దొంగతనం చేసిన మహిళా దొంగకు కోర్టు 9 ఏళ్లు జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.....
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉన్న హార్వే స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుడ్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. హార్వే స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుడ్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ తరఫున స్కూల్ విద్యార్థులకు అందించాల్సిన చికెన్ వింగ్స్‌ను పక్కదారి పట్టించిన ఓ మహిళా ఉద్యోగి చివరికి దొరికిపోయింది. దీంతో కోర్టు ఆమెకు 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
కొవిడ్ సమయంలో విద్యార్థులకు అందించాల్సిన ఆ చికెన్ వింగ్స్‌ను కాస్తా మహిళా ఉద్యోగి పక్కదారి పట్టించింది. స్కూల్ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన పథకంలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. మొత్తంగా 1.5 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.12.5 కోట్ల విలువైన చికెన్ వింగ్స్‌ను చోరీ చేసినట్లు విచారణలో తేలింది.
పౌల్ట్రీ నుంచి చికెన్ వింగ్స్ ను భారీ స్థాయిలో కొనుగోలు చేసి, స్కూల్ వ్యాన్ లోనే తీసుకువచ్చినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రులకు వాటిని అందించలేదంటూ... . జులై 2020 నుంచి ఫిబ్రవరి 2022 వరకు ఈ తతంగం సాగినట్లుగా అధికారుల దర్యాప్తులో తేలింది.ఆమెపై గతేడాది కేసు నమోదు చేయగా, తాజాగా ఈ కేసులో దోషిగా తేలడంతో ఆమెకు 9 ఏళ్ల శిక్ష పడినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.
కొవిడ్ సమయంలో వర్చువల్ పద్ధతిలో తరగతులు కొనసాగించారు. ఆ సమయంలో విద్యార్థులు, వారి కుటుంబాలకు చికెన్ వింగ్స్ తో కూడిన ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం 11 వేల కేసుల వింగ్స్ అవసరమని వారు అంచనా వేశారు. అయితే, ఇందుకోసం కేటాయించిన బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు పెడుతున్నట్లు ఆడిట్ లో తేలింది. దీంతో వెంటనే అనుమానం వచ్చి అధికారులు దర్యాప్తు చేపట్టారు. వాటి నిర్వహణను చూస్తున్న వెరా లిడెల్ చేతివాటం ప్రదర్శించారనే విషయాన్ని గుర్తించారు.