3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ..రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ..రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
  • మొత్తం 16 మంది విత్​డ్రా
  • కరీంనగర్’​గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ బరిలో 56 మంది
  • కరీంనగర్​’ టీచర్స్​కు 15, ‘నల్గొండ’ 
  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 19 మంది పోటీ
  • బరిలో నిలిచినోళ్లలో ఇండిపెండెంట్లే ఎక్కువ

కరీంనగర్ / నల్లగొండ, వెలుగు : రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీలో ఉన్నారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా.. చివరి రోజు 16 మంది తమ నామినేషన్లు విత్​డ్రా చేసుకున్నారు. కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్– ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 56 మంది పోటీ పడుతున్నారు. ఇక ఇదే స్థానంలో టీచర్ ఎమ్మెల్సీకి 15 మంది బరిలో నిలిచారు. అలాగే, వరంగల్– నల్గొండ– ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 19 మంది పోటీలో ఉన్నారు. ఇందులో ఇండిపెండెంట్ల సంఖ్యే ఎక్కువగా ఉన్నది. 

ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో కలిపి గురువారం 16 మంది నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. ‘కరీంనగర్’ గ్రాడ్యుయేట్​ స్థానం నుంచి 12 మంది, టీచర్ ఎమ్మెల్సీ నుంచి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే, ‘నల్గొండ’ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ముగ్గురు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండ నాగరాజు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ!

‘కరీంనగర్’ గ్రాడ్యుయేట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ అభ్యర్థి వూటుకూరి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తున్నది.  కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్​రెడ్డి తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లు క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించారు. నరేందర్ రెడ్డికి సీపీఐ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అలాగే, ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన మాజీ డీఎస్పీ మదనం గంగాధర్.. తన నామినేషన్ ఉపసంహరించుకొని కాంగ్రెస్ లో చేరారు.  బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. 

ALSO READ : 500 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఎడ్యుకేషన్ : సీఎం రేవంత్​రెడ్డి

బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు గ్రామాల్లో గ్రాడ్యుయేట్లను కలుస్తూ అంజిరెడ్డికి ఓటేయాలని కోరుతున్నారు. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో బీజేపీ ఎక్కువగా  సోషల్ మీడియాను నమ్ముకున్నట్టు కనిపిస్తున్నది. ఇకగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో బీఆర్ఎస్ ఇప్పటికీ తేల్చలేదు.   మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు, కల్వకుంట్ల కవిత ఫొటోలతోనే ప్రచారం చేస్తున్నారు.  

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఘాలే కీలకం 

‘కరీంనగర్’, ‘నల్గొండ’ ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీల కంటే ఉపాధ్యాయ సంఘాలే కీలకంగా మారాయి. ఈ సారి ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కూడా ఓటు హక్కు కల్పించిన నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నుంచి పోటీ చేస్తున్న మల్క కొమరయ్య, సుందర్ రాజ్ యాదవ్ లాంటి అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.   ‘కరీంనగర్’ టీచర్ నియోజకవర్గంలో మల్క కొమరయ్యకు బీజేపీ, తపస్  మద్దతు ప్రకటించగా.. యాటకారి సాయన్న బీఎస్పీ మద్దతుతో పోటీలో ఉన్నారు. మిగతా అభ్యర్థులంతా ఇండిపెండెంట్లే. ఆయా టీచర్ యూనియన్ల  సపోర్ట్​తో వారు బరిలో నిలిచారు.  

వీరిలో ప్రధానంగా టీపీటీఎఫ్, -యూటీఎఫ్ అభ్యర్థిగా వై.అశోక్ కుమార్, పీఆర్టీయూ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి, సీపీఎస్ అభ్యర్థిగా ఇన్నారెడ్డి పోటీలో ఉన్నారు. ‘నల్గొండ’ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ యూటీఎఫ్ నర్సిరెడ్డి, పీఆర్టీయూ శ్రీపాల్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి సుందర్ రాజు యాదవ్, జాక్టో అభ్యర్థి పూల రవీందర్, బీజేపీ–-తపస్ అభ్యర్థి సరోత్తం రెడ్డి మధ్య పోటీ నెలకొన్నది. ఈ నియోజకవర్గంలో సుందర్ రాజు యాదవ్, పూల రవీందర్ బీసీ నినాదంతో ముందుకెళ్తున్నారు.