- 10 రోజుల్లో గ్రేటర్ వ్యాప్తంగా వార్డు సభలు
- ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి కాగానే నిర్వహణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర మంతటా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు తెలిపినప్పటికీ, గ్రేటర్లో మాత్రం కాస్తా ఆలస్యం అవుతోంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే పూర్తికాక పోవడమే ఇందుకు కారణం. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లకోసం 10లక్షల70వేల659 దరఖాస్తులు వచ్చాయి. వీటి వెరిఫికేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు 90 శాతం పూర్తయింది. లక్ష దరఖాస్తుల వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. ఇందుకుగాను 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్‌కు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి రెగ్యులర్‌గా రివ్యూలు నిర్వహిస్తున్నారు.
సోమవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లోనూ దీనిపై ఆరా తీశారు. త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. వెరిఫికేషన్ పూర్తి అయిన వెంటనే గ్రేటర్‌వ్యాప్తంగా వార్డు సభలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా రేషన్ కార్డుల కోసం 83,285 మంది నుంచి రెక్వెస్ట్ వచ్చింది. వీటి వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇందులో 90 శాతం మంది అర్హులు ఉన్నట్లు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు గుర్తించారు.