కామారెడ్డి జిల్లాలో 90 కిలోల గంజాయి పట్టివేత

కామారెడ్డి జిల్లాలో 90 కిలోల గంజాయి పట్టివేత

బాన్సువాడ రూరల్, వెలుగు : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్  మండలం మాగి చౌరస్తా వద్ద 90 కేజీల 800 గ్రాముల గంజాయి పట్టుకొని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్​ డిప్యూటీ కమిషనర్  సోమిరెడ్డి తెలిపారు. బాన్సువాడ ఎక్సైజ్  ఆఫీస్​లో మంగళవారం వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా అంబాల గ్రామానికి చెందిన తిరుపతి, గాంధారి మండలం జెమినీ తాండకు చెందిన గేలోత్  సత్నమ్,  శ్రీను, శంకర్, వినోద్  కలిసి గంజాయిని ఒరిస్సా, ఏపీ నుంచి నాందేడ్ కు తరలిస్తున్నారని తెలిపారు. 

ఎన్​ఫోర్స్ మెంట్  సీఐ స్వప్న ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా, స్కార్పియో వాహనంలో ఉన్న  తిరుపతి, గేలోత్  సత్నమ్ ను పట్టుకున్నామని, మిగిలిన వారు పరారైనట్లు చెప్పారు. గంజాయి విలువ రూ.20.50 లక్షలు ఉంటుందని తెలిపారు. ఎక్సైజ్  సూపరింటెండెంట్ హనుమంతరావు, డీసీబీ నాయక్, ఎస్సై తేజస్విని పాల్గొన్నారు.