రాష్ట్రంలో 90 శాతం సర్వే పూర్తయింది

రాష్ట్రంలో 90 శాతం సర్వే పూర్తయింది
  • సర్వేలో తప్పుడు వివరాలిస్తే చర్యలు
  • బీసీ కమిషన్‌‌ చైర్మన్‌‌ గోపిశెట్టి నిరంజన్‌‌

పాలమూరు, వెలుగు : సమగ్ర కుటుంబ సర్వేలో తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్‌‌ చైర్మన్‌‌ గోపిశెట్టి నిరంజన్‌‌ హెచ్చరించారు. మహబూబ్‌‌నగర్‌‌ కలెక్టరేట్‌‌లో శుక్రవారం ఉదయం బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ, వివిధ కుల సంఘాలు, వ్యక్తులు, మైనార్టీల నుంచి 135 అప్లికేషన్లు తీసుకున్నారు. అనంతరం చైర్మన్‌‌ గోపిశెట్టి నిరంజన్‌‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందన్నారు. 

జంట నగరాలు తప్ప మిగతా జిల్లాల్లో 85 నుంచి 90 శాతం పూర్తి అయిందని, ఇందులో మహబూబ్‌‌నగర్‌‌లో 94 శాతం, వనపర్తి జిల్లాలో 88 శాతం, నాగర్‌‌కర్నూల్‌‌లో 84.2 శాతం, జోగులాంబ గద్వాలలో 94 శాతం, నారాయణపేటలో 92.5 శాతం సర్వే పూర్తైందని వివరించారు.  సర్వేలో సేకరించిన సమాచార కాపీలను భద్రపరుస్తామన్నారు. చాలా మంది స్టూడెంట్లు ఉన్నత చదువుల కోసం మహబూబ్‌‌నగర్‌‌కు వస్తారని, వారి కోసం రెండు హాస్టల్స్‌‌ ఏర్పాటు చేయాలని మహబూబ్‌‌నగర్‌‌ ఎమ్మెల్యే కోరారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 

సర్పంచ్‌‌లకు పెండింగ్‌‌లో ఉన్న బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పలువురు సర్పంచ్‌‌ల నుంచి వినతులు వచ్చాయన్నారు. విచారణలో వచ్చిన అప్లికేషన్లు, అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. విచారణలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌‌రెడ్డి, కలెక్టర్లు విజయేందిర బోయి, బదావత్‌‌ సంతోష్, ఆదర్శ్ సురభి, అడిషనల్‌‌ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌‌రావు, లక్ష్మీనారాయణతో పాటు పలువురు ఆఫీసర్లు పాల్గొన్నారు.