ఆదిలాబాద్ జిల్లాలో ఎకరానికి 4 క్వింటాళ్లే .. ఈ ఏడాది సాగు పెరిగినా తగ్గిన పత్తి దిగుబడి

  • జిల్లాలో 90 శాతం ముగిసిన కొనుగోళ్లు
  • అంచనా 32 లక్షలు.. వచ్చింది 21 లక్షల క్వింటాళ్లు
  • నాణ్యతలేని విత్తనాలతోనే నష్టపోయామంటున్న రైతులు 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట అత్యధికంగా సాగవుతున్నప్పటికీ.. దిగుబడిలో మాత్రం వెనుకబడిపోతోంది. జాతీయ స్థాయిలో ఇక్కడి పత్తి పంటకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ.. దిగుబడి మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఎకరానికి 4 క్వింటాళ్లు కూడా రాలేదు. దీనికి తోడు ఆశించిన రాబడి లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

పంట తొలగిస్తున్న రైతులు

జిల్లా వ్యాప్తంగా గతేడాది అక్టోబర్ లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సీసీఐ ఆధ్వర్యంలో ఆదిలాబాద్​లో రెండు, బోథ్, నేరడిగొండ, పొచ్చెర, సొనాల, ఇంద్రవెల్లి, నార్నూర్, గుడిహత్నూర్, ఇచ్చోడ, బేలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తి కొనుగోళ్లు జరిపింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 90 శాతం పత్తి కొనుగోళ్లు పూర్తయ్యాయని, మరో 10 శాతం పత్తి మార్కెట్​కు వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. సాధారంగా గతంలో జనవరి చివరి వారం వరకు పత్తి దిగుబడులు వచ్చేవి. కానీ పంట ఎక్కువగా పండకపోవడంతో జనవరి ప్రారంభంలోనే పత్తి తొలగించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పత్తి పంట తొలగించిన రైతులు.. శనగ, జొన్న పంటలను వేసుకుంటున్నారు.

మార్కెట్​కు వచ్చింది 21 లక్షల క్వింటాళ్లు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 4.10 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే 30 వేల ఎకరాల్లో పత్తి సాగు పెరిగింది. అయితే ఆశించిన స్థాయిలో దిగుబడులు మాత్రం రాలేదు. సాగైన పత్తి లెక్కని బట్టి 32 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు 90 శాతం కొనుగోళ్లు పూర్తయినప్పటికీ కేవలం 21 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే మార్కెట్ కు వచ్చింది. ఇందులో 9261 మంది రైతుల నుంచి ప్రైవేట్ వ్యాపారులు 1,51,057 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా.. సీసీఐ 99,242 మంది రైతుల నుంచి 19,82,525 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. ఈ ఏడాది 70 శాతం మంది రైతులకు ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. కొంత మందికి రెండు నుంచి మూడు క్వింటాళ్లు కూడా దాటలేదు. దీంతో అంచనాలకు తగ్గట్టు దిగుబడి రాలేదు. మూడేండ్ల క్రితం ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల  దిగుబడి రాగా.. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. 

నాణ్యతలేని విత్తనాలు.. వాతావరణ పరిస్థితులు

రైతులకు పత్తి మొదటి నుంచే నష్టాలే మిగుల్చు తోంది. ప్రతి ఏడాది నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తూ కొన్ని ప్రైవేట్ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఓ ఏడాది పంట బాగా పండిందని మరో ఏడాది అదే విత్తనాలు వేసినప్పటికీ.. దిగుబడి మాత్రం రావడంలేదు. నాణ్యత లేని విత్తనాలు అంటగట్టడంతోనే నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు పంట ఎదుగు దశలో అకాల వర్షాలు, వాతావరణ పరిస్థితులు సైతం పంట దిగుబడులపై ప్రభావం చూపుతోంది. పత్తి పింజ దశలో గులాబి పురుగు సోకుతుండటంతో పత్తి పింద దెబ్బతిని నాణ్యత లోపిసోందని అధికారులు చెప్తున్నారు. ఎంతోకొంత పంట చేతికొస్తే.. చివరకు ధరలు ఆశించిన స్థాయిలో ఉండకపోవడతో రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. 

తీవ్రంగా నష్టపోయాం..

ఈ ఏడాది ఆరు ఎకరాల్లో 16 బ్యాగుల పత్తి విత్తనాలు వేశాను. ఇప్పటి వరకు 20 క్వింటాళ్లు మాత్రమే పంట దిగుబడి వచ్చింది. ఇక పంట వచ్చే పరిస్థితి కూడా లేదు. గతంలో 30 క్వింటాళ్లకు పైగా పత్తి వచ్చేది. విత్తనాల్లో నాణ్యత లేకపోవడంతో ఇట్ల జరుగుతోందని అనుమానంగా ఉంది.

ఆడే కిషన్, రైతు అంకోలి