- శనివారం శ్రీవారిని దర్శించుకున్న 90 వేల మంది
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో పాటు వీకెండ్ రావడంతో నాలుగు రోజులుగా తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక నుంచి వచ్చే వారితో వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రిండ్ రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారిని దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. టైమ్ స్లాట్ దర్శనానికి 7 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని తెలిపింది.
ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సర్వదర్శనం భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. వారికి తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. శనివారం అత్యధిక సంఖ్యలో తిరుమల శ్రీవారిని 90 వేల 721 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.28 కోట్లు రాగా, రికార్డు స్థాయిలో 50,599 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, టీటీడీ భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముంది.