దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 2024, నవంబర్ 15న పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్, జనక్‌పురి ప్రాంతాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 82 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. ఓ కొరియర్ షాప్‌లో భారీగా కొకైన్ నిల్వ ఉంచినట్లు సమాచారం అందటంతో మెరుపు దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో భాగంగా ఓ కొరియర్ షాప్‌లో ఆస్ట్రేలియాకు పంపేందుకు సిద్ధంగా ఉన్న 82 కిలోల కొకైన్‌ను సీజ్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.900 కోట్లు ఉంటుందని ఎన్‌సీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ సిండికేట్‌కు విదేశాలతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల సోనిపట్‌కు చెందిన వారిగా గుర్తించామన్నారు. భారీ డ్రగ్ రాకెట్‌ను బ్రస్ట్ చేసిన ఎన్సీబీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు.
ALSO READ | వర్క్లైఫ్ బ్యాలెన్స్పై నమ్మకంలేదు అంటున్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి..టెకీలు ఏమంటున్నారంటే
‘‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇవాళ న్యూఢిల్లీలో 82.53 కిలోల హై-గ్రేడ్ కొకైన్‌ను జప్తు చేసింది. ఒకే రోజు అక్రమ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ భారీ డ్రగ్ బస్ట్ ఆపరేషన్ డ్రగ్స్ రహిత భారత్‌ను నిర్మించాలనే మోడీ ప్రభుత్వ తిరుగులేని సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది. ఇకపైన డ్రగ్ రాకెట్లపై మా వేట నిర్దాక్షిణ్యంగా కొనసాగుతుంది. ఈ భారీ విజయం సాధించిన ఎన్‌సీబీకి అభినందనలు’’ అని అమిత్ షా ఎక్స్ వేదికగా ఎన్సీబీని ప్రశంసించారు.