90 వేల మంది సిబ్బంది.. నెల రోజులు కులగణనకు సర్కారు ఏర్పాట్లు

90 వేల మంది సిబ్బంది.. నెల రోజులు కులగణనకు సర్కారు ఏర్పాట్లు
  • గైడ్​లైన్స్​పై తుది దశకు చేరిన కసరత్తు
  • జీఏడీ, పీఆర్, రెవెన్యూల్లో ఏదో ఒక శాఖకు బాధ్యతలు
  • సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్  ఆధ్వర్యంలో పర్యవేక్షణ
  • మంత్రి పొన్నం ఆధ్వర్యంలో సెక్రటేరియెట్​లో కీలక భేటీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన గైడ్​లైన్స్​పై ఇప్పటికే కసరత్తు పూర్తయింది.  గణనకు నెలరోజులు పట్టే అవకాశముందని, 90 వేల మంది సిబ్బంది అవసరమని ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ), పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల్లో ఏదో ఒక శాఖకు కులగణన బాధ్యతలు అప్పగించే అవకాశముందని భావిస్తున్నారు. సీఎంతో చర్చించాక రెండు, మూడు రోజుల్లో సీనియర్ మంత్రులతో జరిగే సమావేశంలో కుల గణన గైడ్​లైన్స్​ ఫైనల్​ చేయనున్నట్టు తెలిసింది. కుల గణన తర్వాతే  బీసీ రిజర్వేషన్లు పెంచి, పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంచేసింది. 

ఈ మేరకు ఎంపీ ఎన్నికలకు ముందే కేబినెట్ తీర్మానం చేయడంతోపాటు కులగణన కోసం రూ.150 కోట్లకు సర్కారు అడ్మినిస్ట్రేటివ్​ సాంక్షన్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో  కొత్త బీసీ కమిషన్​ఏర్పాటు చేసిన ప్రభుత్వం, అంతకుముందే వివిధ రాష్ట్రాల్లో కులగణన జరిగిన తీరుపైఅధ్యయనం కూడా చేయించింది. దీనికితోడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. అటు బీసీ సంఘాలు కూడా కుల గణనకు డిమాండ్​చేస్తూ సర్కారుపై ఒత్తిడిపెడ్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో వర్గీకరణకు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. ఎస్సీల్లోనూ ఉప కులాలవారీగా లెక్కలు తీయడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే సర్కారు సాధ్యమైనంత త్వరగా కుల గణన చేయాలనే నిర్ణయానికి  వచ్చింది. 

సీనియర్​ ఐఏఎస్​తో పర్యవేక్షణ..

కుల గణనను నెల రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు 90 వేల మంది సిబ్బంది అవసరమని ఆఫీసర్లు అంచనా వేశారు.  లెక్కలు పక్కాగా,  పారదర్శకంగా ఉండేందుకు  బీసీ సంక్షేమ శాఖకు  సంబంధం లేకుండా జీఏడీ లేదా పంచాయతీ రాజ్ లేదంటే రెవెన్యూ శాఖల ఉద్యోగులతో గణన జరిపించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్​గా పరిశీలిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ ను నియమించనున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే మంగళవారం బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, మెంబర్లు బాలలక్ష్మి, తిరుమలగిరి సురేందర్, జయప్రకాశ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై, వివిధ రాష్ట్రాల్లో కుల గణన జరిగిన తీరుతెన్నులు, రాష్ట్రంలో అనుసరించాల్సిన విధి విధానాలు,  సిబ్బంది సమీకరణ, పర్యవేక్షణ, కులగణనకు పట్టే సమయంలాంటి అంశాలపై చర్చించారు.  త్వరలో కులగణనపై సీనియర్ మంత్రులు సమావేశమై, గైడ్​లైన్స్​కు తుదిరూపం ఇవ్వాలని నిర్ణయించారు.   సీఎం తో ఆమోద ముద్ర అనంతరం ఉత్తర్వులు ఇచ్చేలా తాజా సమావేశంలో రూట్​మ్యాప్​రెడీ చేశారు.

ఎస్సీ వర్గీకరణపైనా సమావేశం.. 

 ఎస్సీ వర్గీకరణ కు సుప్రీంకోర్టు గ్రీన్​సిగ్నల్​ఇచ్చిన విషయం తెలిసిందే.  ఎస్సీ వర్గీకరణపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంత్రి ఉత్తమ్ చైర్మన్ గా మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్​, సీతక్క, శ్రీధర్ బాబు , ఎంపీ మల్లు రవితో కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటివరకు 4 సార్లు సమావేశమైంది. మంగళవారం సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ.. రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి  సిఫారసు చేసింది.  మరో వైపు వర్గీకరణపై సలహాలు , సూచనలు  ఇవ్వాలని సర్కారు ఇప్పటికే కోరగా, ఆన్​లైన్, ఆఫ్​లైన్​లో దళిత సంఘాలు,  మేధావులనుంచి  సుమారు 1200 వినతులు వచ్చాయి. ఎస్సీల లెక్క తేలితే వర్గీకరణ ఈజీ అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఇలా అటు బీసీల లెక్క తేలాలన్నా, ఇటు ఎస్సీల్లో ఉపకులాలవారీగా వివరాలు రావాలన్నా కులగణన చేపట్టం ఒక్కటే మార్గంగా కనిపిస్తున్నది.  ఆ లెక్కల ప్రకారమే ఇకపై బడ్జెట్ లో ఆయా వర్గాలకు నిధులు కేటాయింపు, ఖర్చు ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం..

వివిధ రాష్ట్రాల్లో  కుల గణన నిర్వహణ తీరుపై గత బీసీ కమిషన్ అధ్యయనం చేసి, సీఎం రేవంత్​రెడ్డికి రిపోర్ట్​ అందజేసింది. ఇప్పటివరకూ కర్ణాటక, బిహార్,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కుల గణన పూర్తి కాగా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో శాఖ నిర్వహించడం విశేషం.  కర్ణాటకలో బీసీ కమిషన్  సర్వే చేపట్టగా, బిహార్ లో జీఏడీ, ఏపీలో పంచాయతీరాజ్  సర్వే చేయడం విశేషం. ఆయా రాష్ట్రాల్లో ఆయా శాఖలు సర్వే చేసే క్రమంలో ఎదురైన సమస్యలు, పట్టిన సమయం, తుది ఫలితాలు ఎలా ఉన్నాయనేదానిపై మంగళవారం జరిగిన మీటింగ్​లో చర్చించారు. 

ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ , మెంబర్లు బాలలక్ష్మి, తిరుమలగిరి సురేందర్, జయప్రకాశ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, పంచాయతీ రాజ్ సెక్రటరీ లోకేశ్​ కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, బీసీ కమిషనర్ బాల మాయాదేవి, లా సెక్రటరీ తిరుపతి  తమ అభిప్రాయాలను మంత్రి పొన్నంతో పంచుకున్నారు. ఈ 3 రాష్ట్రాల్లోనూ  డోర్ టు డోర్ సర్వే చేసినట్టు కమిషన్ రిపోర్ట్ లో పేర్కొనడం విశేషం. దీనిని పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలో కులగణనకు 90 వేల సిబ్బంది అవసరమని, నెలరోజుల టైం పడ్తుందని అంచనాకు వచ్చినట్టు సమాచారం.