
సిద్దిపేట, వెలుగు : సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆయనకు ఇండిపెండెంట్ల నుంచి తలనొప్పి మొదలైంది. గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీకి దిగి తమ సమస్యలను ప్రజల ముందుకు తేవాలనే సంకల్పంతో పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. ఈనెల 3 నుంచి 10వ తేదీ వరకు మొత్తం 127 మంది నామినేషన్లు వేయగా ఏడుగురి నామినేషన్లను పలు కారణాలతో అధికారులు రిజెక్ట్ చేశారు. మిగిలిన 114 మంది నామినేషన్లు ఒకే అయ్యాయి. ఆమోదం పొందిన నామినేషన్లలో నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు, 19 రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు పోగా, మిగిలిన 91 మంది ఇండిపెండెంట్లే కావడం గమనార్హం.
నామినేషన్ల విత్ డ్రా కోసం ఒత్తిడి
గజ్వేల్ నియోజకవర్గం నుంచి చెరుకు రైతులు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు, వట్టినాగులపల్లి ధరణి బాధితులు, నిరుద్యోగులు, తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు చెందిన పలువురు నామినేషన్లు వేశారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ధరణి బాధితులు 45 మంది, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఇద్దరు, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు ఆరుగురు, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన చెరుకు రైతులు పది మంది, నిరుద్యోగులు ఐదుగురు, అమరుల కుటుంబ సభ్యులు 20 మంది నామినేషన్లు దాఖలు చేయడం ఆసక్తి కలిగిస్తోంది. అమరుల కుటుంబాల తరపున నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకోవాలని రూలింగ్ పార్టీకి చెందిన కొందరు నేతలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరుల కుటుంబాలకు నేతృత్వం వహిస్తున్న రఘుమారెడ్డి యుగ తులసి పార్టీ తరపున నామినేషన్ వేశారు. యుగ తులసి పార్టీ గుర్తు రోడ్డురోలర్ కావడంతో రూరల్ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఈవీఎం నుంచి ఆ గుర్తును తొలగించాలని ఓ ముఖ్య నేత తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అలాగే నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత ఒకరు తన అనుచరుడితో చివరి నిమిషంలో మరో బీ ఫామ్ తో యుగ తులసి పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసినా అధికారులు అంగీకరించకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌కే పరిమితమయ్యాడు.
ఇండిపెండెంట్లకు బీఆర్ఎస్ నేతల బుజ్జగింపులు
గజ్వేల్ స్థానానికి నామినేషన్లు వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థులను బుజ్జగించడానికి కొందరు బీఆర్ఎస్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులు భారీ సంఖ్య లో పోటీలో ఉంటే పోలింగ్ రోజు ఓటర్లు ఇబ్బందిపడి తమకు పడే ఓట్లను ఇతరులకు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నామినేషన్లు వేసిన కొందరిని సంప్రదిస్తూ వెనక్కి తీసుకుంటే వారి సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీలు ఇస్తున్నారు. మొదట
కొండపోచమ్మ, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తారన్న సమాచారంతో నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేత ముందే రంగలోకి దిగారు. ఆ నేత బుజ్జగింపులతో పలువురు వెనక్కి తగ్గారు. దీంతో ప్రస్తుతం ఇద్దరు మల్లన్న సాగర్ భూనిర్వాసితులు, నలుగురు కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు మాత్రమే నామినేషన్లు వేశారు. వారిపై ఎంత ఒత్తిడి తెచ్చినా నామినేషన్ల ఉప సంహరణకు ససేమిరా అంటుండడంతో బీఆర్ఎస్ నేతలు తలపట్టుకుంటున్నారు. ఇక మిగిలిన నామినేషన్లలో వేర్వేరు జిల్లాల నుంచే ఎక్కువ ఉండ డంతో ఆయా జిల్లాల నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. నిరుద్యోగులు, తెలంగాణ అమర వీరులు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదని చెప్తున్నారు.
బ్యాలెట్టా? ఈవీఎంలా?
గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో బ్యాలెట్ పేపర్ వాడతారా? లేదంటే ఈవీఎంలతో పోలింగ్ నిర్వహిస్తారా? అన్న చర్చ నడుస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానానికి 185 మంది నామినేషన్లు వేయగా పోలింగ్ కేంద్రాల్లో 12 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో ఆ పరిస్థితి తలెత్తకుండా చూసే దిశగా బీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే గజ్వేల్ బరిలో 50 మందికి తక్కువ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్కో ఈవీఎంలో 15 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉండే చాన్స్ ఉంది. దీంతో పోలింగ్
కేంద్రాల్లో అధిక సంఖ్య లో ఈవీఎంలు అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తుండగా పేపర్ సైజ్ బ్యాలెట్ పేపర్ వాడినా ఓటర్లు గందగోళానికి గురికావచ్చని తెలుస్తోంది. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ పోటీతో గజ్వేల్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంటే.. మరోవైపు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం మరింత ఆసక్తి రేపుతోంది.
కామారెడ్డిలో 42 మంది ఇండిపెండెంట్లు
కామారెడ్డి,: కామారెడ్డి బరిలో 42 మంది ఇండిపెండెండ్లు నిలిచారు. అన్ని పార్టీలు, ఇండిపెండెంట్లతో కలిసి మొత్తం 74 మంది నామినేషన్వేయగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీల నుంచి నలుగురు పోటీలో నిలిచారు. వీరు కాకుండా స్థానిక పార్టీల నుంచి 12 మంది నామినేషన్వేయగా ఎలక్షన్కమిషన్ఓకే చెప్పింది. స్ర్కూటినీలో ఆరుగురి నామినేషన్లను తిరస్కరించారు. దీంతో మొత్తంగా 54 మంది పోటీ పడనున్నారు. నామినేషన్ల విత్‌డ్రాకు బుధవారం చివరి రోజు కావడంతో ఇందులో ఎంతమందిని వీలైతే అంతమందిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే లిస్టులోని చాలామందితో స్థానిక బీఆర్ఎస్లీడర్లు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
కామారెడ్డి వాళ్లే 25 మంది
మొత్తం 54 మంది నామినేషన్లు వేయగా ఇందులో కామారెడ్డి జిల్లాకు చెందిన వారు 25 మంది ఉన్నారు. మిగతా 29 మంది నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిరిగి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు.
నిరుద్యోగుల బాధలు తెలపాలనే నామినేషన్
నిరుద్యోగుల బాధలు ప్రభుత్వానికి తెలవాలనే ఉద్దేశంతోనే గజ్వేల్ లో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన. ఏండ్ల తరబడి కష్టపడి చదివి పరీక్షలు రాస్తే కొందరు తమ స్వార్థానికి చేసిన తప్పుల వల్ల నోటిఫికేషన్లు రద్దయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. నేను గత ఆరేండ్లుగా హైదరాబాద్ లో అద్దె ఇంట్లో ఉంటూ పరీక్షలకు ప్రిపేరవుతుంటే నోటిఫికేషన్లు రద్దవడం ఎంతో బాధ కలిగించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ
నా నామినేషన్‌ను ఉపసంహరించుకోను.
- శ్రీకాంత్, నిరుద్యోగి, తొగుట