మునుగోడులో 92శాతం పోలింగ్

  • మునుగోడులో చివరి రోజూ ఆగని ప్రలోభాలు
  • మర్రిగూడెం, చండూర్​లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొట్లాట
  • నియోజకవర్గంలోనే మకాం వేసిన నాన్​ లోకల్స్​
  • 13 కేంద్రాల్లో రాత్రి 9.30 వరకు క్యూలైన్లు.. ఎల్లుండి ఓట్ల లెక్కింపు

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు : ఓటర్లకు ప్రలోభాలు.. పలు చోట్ల టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య లొల్లులు.. డబ్బులు ఇయ్యలేదని, తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఓటర్ల నిరసనల నడుమ మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ పూర్తైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు గురువారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. హైదరాబాద్​లో ఉండే ఓటర్లు మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మర్రిగూడెం, చండూరు మండలాల్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు, పోలీస్ లాఠీచార్జ్​ మినహా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చాలా కేంద్రాల్లో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత  పెద్ద సంఖ్యలో క్యూ లైన్లు కనిపించాయి. 13 కేంద్రాల్లో రాత్రి 9. 30 గంటల వరకు కూడా పోలింగ్​ జరిగింది. ఓ కేంద్రంలో మాత్రం రాత్రి పదిన్నర గంటల వరకూ కొనసాగింది. 92 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 

ఓటేసిన అభ్యర్థులు

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సంస్థాన్​నారాయణపురం మండలంలోని తన సొంత గ్రామమైన లింగ వారిగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి చండూరు మండలంలోని ఇడికూడ గ్రామంలో ఓటేశారు. బీఎస్పీ అభ్యర్థి శంకరాచారి తన సొంత గ్రామమైన సంస్థాన్​ నారాయణపురం మండలంలోని జనగాంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. డీఎస్పీ అభ్యర్థి గాలయ్య నారాయణపురం మండలంలోని పుట్టపాక లో ఓటు వేశారు. 

6న రిజల్ట్

మునుగోడు ఉప ఎన్నిక ఓట్లను ఈనెల 6న నల్గొండలోని ఎఫ్​సీఐ గోడౌన్​లో లెక్కించనున్నారు. పోలింగ్ స్టేషన్ల నుంచి రాత్రి తెప్పించిన ఈవీఎం యూనిట్లను భారీ బందోబస్తు మధ్య చండూరులోని డీఆర్సీ సెంటర్ నుంచి నల్గొండకు తరలించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. ఇందుకు అవసరమైన టేబుళ్ల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ, మాక్ కౌంటింగ్ తదితర ప్రక్రియలన్నీ పూర్తి చేశారు. 

ఓటర్లకు మనీ, మందు

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పోలింగ్​ రోజు కూడా పెద్ద ఎత్తున పంపకాలు జరిగాయి. పోలింగ్ సమయం ముగిసే వరకు పలువురు టీఆర్ఎస్​ లీడర్లు నగదు, మద్యం పంచినట్లు ఓటర్లు చెప్తున్నారు. నాన్ లోకల్ నాయకులు చాలా చోట్ల తిష్టవేసి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. నగదు పంపిణీ చేస్తున్న టీఆర్​ఎస్​ లీడర్లను పలు చోట్ల బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 10 వార్డులో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నాయకుడిని పోలీసులు పట్టుకున్నారు. సంస్థాన్​ నారాయణపురం మండలం పుట్టపాకలో టీఆర్ఎస్ లీడర్ల నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. కారులో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన టీఆర్ఎస్  వ్యక్తి వద్ద రూ. లక్షా 2 వేలు, అలాగే ఓ ఫంక్షన్ హాల్ లో రూ. లక్షా  96 వేల నగదు, మద్యం, టీఆర్ఎస్ ప్రచార సామగ్రి, టీఆర్ఎస్  గొడుగులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల అధికారులకు చిక్కిన 10 మంది కోరుట్లకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అనుచరులని ప్రచారం జరుగుతున్నది. మర్రిగూడ మండలం భీమనపల్లిలో నంబర్ ప్లేట్ లేని కారులో మద్యం, డబ్బులు తరలిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తను బీజేపీ క్యాడర్  పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నాంపల్లి మండలం టీపీ గౌరారంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డికి సంబంధించిన అనుచరుల వాహనాల్లో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు తీసుకొచ్చి పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. చౌటుప్పల్ లో పఠాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ పోలింగ్ సెంటర్ సమీపంలో కూర్చొని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళనకు దిగారు. వెంటనే స్థానికేతరులను పంపించాలని వారు డిమాండ్ చేశారు. నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి లో టీఆర్ఎస్ నాయకుల వద్ద బీజేపీ నాయకులు పట్టుకున్న కారులో నగదు లభించింది. మర్రిగూడ మండలం భీమనపల్లిలో నంబర్ ప్లేట్ లేని కారులో పోలీసులు 10 లక్షల నగదు పట్టుకున్నారు. ఈ కారుపై ఎంపీ స్టిక్కర్ వేసి ఉంది.

పలుచోట్ల ఘర్షణలు

చండూర్ మున్సిపాలిటీలోని 4వ వార్డులో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒక ఇంట్లో టీఆర్​ఎస్​ నేత డబ్బులు పంచుతున్నాడని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. పరస్పరం దాడులు  చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. చండూరు పట్టణంలోని ఓ ఇంట్లో టీఆర్ఎస్ కు చెందిన కరీంనగర్ నేతలు ఉన్నారని తెలిసి బీజేపీ నేతలు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారు తప్పించుకొని పారిపోయారు. అంతలో అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలే స్థానికేతరులు అంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు రావడంతో ఘర్షణ సద్దుమణిగింది. సిద్దిపేటకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు స్థానికంగా తిష్ట వేసి ఓటర్లను ప్రలోభాలకు  గురి చేస్తున్నారంటూ మర్రిగూడ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. సంస్థాన్​ నారాయణపురం మండలం జనగాం విలేజ్ లో టీఆర్ఎస్ వ్యక్తులు కొత్తగా నిర్మిస్తున్న తమ ఇంట్లో రూ.50 వేలు పెట్టి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని బీజేపీ కార్యకర్త నర్సింహా భార్య ఆరోపించింది. సంస్థాన్​ నారాయణపురం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ బూత్ వద్ద పోలీసులు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ బీజేపీ లీడర్ పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడంతో బయటకు పంపించామని  పోలీసులు తెలిపారు. ఇదే విషయమమై పోలీసులు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. 

  • మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో పోలింగ్ మందకొడిగా  కొనసాగింది. ఇక్కడ శివన్నగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఎక్కువగా ఉన్నారు. తమకు ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించడంలేదంటూ కొన్నాళ్లుగా వీరు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. 
  • గట్టుప్పల్ మండలం అంతంపేట, సోమరాజుగూడ గ్రామాలకు చెందిన 15 మంది ఓటర్లు బొంబాయిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఓటు వేయడానికి రావాలని, ఓటుకు రూ. 3,000తోపాటు అదనంగా బస్సు చార్జీలు ఇస్తామని టీఆర్ఎస్ నాయకులు చెప్పడంతో వచ్చినట్లు వారు చెప్పారు. అయితే.. తాము వచ్చి నాలుగు రోజులు అవుతున్నా ఇంతవరకు తమను  పిలిపించిన వారు ఎవరు కూడా స్పందిస్తలేరని  వాపోయారు. 
  • సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలోని పోలింగ్ బూత్ నెంబర్ 82 లో, మునుగోడు మండలం కొంపల్లిలో ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి.
  • సమస్యలు తీర్చే వరకూ  ఓటెయ్యబోమన్న గిరిజనులు

నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం రంగం తండాలో 320 మంది గిరిజనులు ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని, తమ సమస్యను చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఓటు వేయమంటూ హెచ్చరించారు. దీంతో మంత్రి కేటీఆర్​తో స్థానిక టీఆర్ఎస్​లీడర్లు ఫోన్​లో మాట్లాడించారు. తండాను గ్రామపంచాయతీగా మారుస్తామని, రోడ్డు వేయిస్తామని కేటీఆర్​ హామీ ఇవ్వడంతో స్థానికులంతా ఓటు వేసేందుకు వెళ్లారు. 

తేల్చేది చివరి 3 గంటల ఓటింగే!

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో 91.30 శాతం ఓట్లు నమోదయ్యాయి. ప్రస్తుత ఉప ఎన్నికలో అంతకంటే ఎక్కువగానే రికార్డయ్యాయి. చివరి మూడు గంటల్లో ఓట్ల శాతం భారీగా పెరిగింది. గత ఏడాది హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇలానే చివరి మూడుగంటల్లో పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి. మునుగోడులో ఉదయం ఏడు గంటలకు పోలింగ్​ ప్రారంభం కాగా.. మొదటి రెండు గంటల్లో 11.2 శాతం మంది ఓటు వేశారు. 11 గంటల వరకు 25.8 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పోలింగ్​ ముగిసేవరకు 92శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోలింగ్ శాతం భారీ స్థాయిలో పెరగడం ఎవరికి కలిసి వస్తుందోనని, ఎవరిని దెబ్బతీస్తుందోనని అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రధానంగా బీజేపీ, టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పోటీలో కనిపించినా.. గురువారం ఉదయం నుంచి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గానే ఓటింగ్​ జరిగినట్టు ఆయా పార్టీలు అంచనా వేసుకున్నాయి. తమకే పాజిటివ్ ఓటు నమోదైందని టీఆర్ఎస్ నాయకులు చెప్తుండగా.. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై బలమైన నిరసన, వ్యతిరేకత చూపారని, తామే గెలుస్తామని బీజేపీ లీడర్లు అంటున్నారు.