రాష్ట్రంలో మరో 920 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 920 కరోనా కేసులు

గ్రేటర్‌ హైదరాబాద్లోనే 737..
మొత్తంగా 11,364కు చేరిన బాధితుల సంఖ్య
వైరస్‌‌తో మరో ఐదుగురు మృతి
ప్రైవేటు హాస్పిటళ్లలో కరోనా దోపిడీ
ఆరు రోజుల ట్రీట్మెంట్కు మూడున్నర లక్షల బిల్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. పది రోజులుగా రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నయి. సోమవారం 872, మంగళవారం 879, బుధవారం 891 కేసులురాగా.. శుక్రవారం ఏకంగా 920 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 737 కేసులు నమోదైనట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. రంగారెడ్డిలో 86, మేడ్చల్‌లో 60, కరీంనగర్‌‌లో 13 కేసులు వచ్చాయి. సిరిసిల్లలో 4, మహబూబ్‌నగర్‌, నల్గొండల్లో మూడు చొప్పున.. ములుగు, వరంగల్ అర్బన్, మెదక్ జిల్లాల్లో 2 చొప్పున, సిద్దిపేట, వరంగల్ రూరల్, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్, ఆసిఫా బాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 11,364కు పెరిగింది. ఇందులో 4,688 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 6,446కు పెరిగింది. ఇక కరోనాతో గురువారం మరో ఐదుగురు చనిపోయినట్టు బులెటిన్లో పేర్కొన్నారు. వీటితో మరణాల సంఖ్య 230కి చేరింది.

ప్రైవేటులో నిబంధనలు పాటిస్తలె..
కరోనా టెస్టుల విషయంలో ప్రైవేటు ల్యాబ్స్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని, పోర్టల్ లో అప్‌ లోడ్‌ చేస్తున్న టెస్ట్ రిజల్ట్స్ అన్నీ తప్పులుగా ఉంటున్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. నిపుణులతో కూడిన ఓ టీమ్‌ గురువారం పలు ల్యాబులకు వెళ్లి పరిశీలించిందన్నారు. టెస్టులు చేస్తున్న పద్ధతి, ఇతర అంశాలను పరిశీలించిన టీమ్ ఓ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆ నివేదిక ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

కార్పొరేట్ హాస్పిటళ్లలో ఆగని దోపిడీ
ప్రైవేటు హాస్పిటళ్లలో కరోనా పేరిట దోపిడీ కొనసాగుతోంది. సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో యాకుత్‌పురాకు చెందిన 35 ఏండ్ల పేషెంట్‌ ఆరు రోజులు కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటే.. ఏకంగా మూడు లక్షల 40 వేల బిల్లు వేశారు. ఇందులో పీపీఈ కిట్లకే 45 వేలు చార్జి చేశారు. బెడ్ చార్జీలకు 72,500, డాక్టర్‌ ‌ఫీజుల పేరిట 45,600 వసూలు చేశారు. డాక్టర్‌ ‌కన్సల్టేషన్ ఫీజు సర్కారు ప్రకటించిన ప్యాకేజీలోనే ఉండగా.. ఇలా సెపరేట్‌గా రోజుకు 7,600 వేల చొప్పున చార్జి చేయడం గమనార్హం. ఇలాంటి ఘటనలు ఎన్నో బయటకు వస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

For More News..

రాష్ట్రంలో కరోనా టెస్టులకు బ్రేక్