ఇండియాలో ఇప్పుడు 5G శకం నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది 5జీ సబ్‌స్క్రిప్షన్‌తో అనేక సేవలను పొందుతున్నారు. భారతదేశంలో 5జీ వినియోగదారులు 130 మిలియన్లకు చేరుకోగా.. తాజా నివేదిక ప్రకారం 2029 నాటికి, ఈ సంఖ్య 860 మిలియన్లకు చేరుకోనుంది. 2023 చివరి నాటికి ప్రపంచ జనాభాలో 45% కంటే ఎక్కువ మందికి, 2029 చివరి నాటికి 85% మందికి 5G కవరేజీ అందుబాటులో ఉంటుందని కూడా ఎరిక్సన్ నివేదిక అంచనా వేసింది.
4G నుండి 5Gకి పెద్ద మార్పు
5G అనేది మన ప్రస్తుత ఇంటర్నెట్ కు సూపర్ హీరో వెర్షన్ లాంటిది. ఇది చాలా వేగంగా ఉంటుంది. క్షణాల్లోనే చాలా ఎక్కువ డేటాను హ్యాండిల్ చేయగలదు. ప్రస్తుతం, భారతదేశంలో చాలా మంది వినియోగదారులు 4G నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ 5Gకి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణతో, 4Gని ఉపయోగించే వారి సంఖ్య 2023లో 870 మిలియన్ల నుంచి 2029 నాటికి 390 మిలియన్లకు పడిపోవచ్చని సమాచారం.
గ్లోబల్ 5G ట్రెండ్
5G ఫీవర్ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచాన్ని సైతం శాసిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా, 2023లో మొత్తం దాదాపు 610 మిలియన్ల కొత్త 5G సబ్‌స్క్రిప్షన్‌లు నమోదు కానున్నాయని అంచనా. 2029 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 5.3 బిలియన్ల మంది ప్రజలు 5Gని ఉపయోగిస్తున్నారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్లకు పైగా 5G సబ్‌స్క్రిప్షన్‌లు వచ్చాయని, ప్రతి ప్రాంతంలో 5జీకి ఆదరణ పెరుగుతున్నందున, అధిక-పనితీరు గల కనెక్టివిటీకి డిమాండ్ బలంగా ఉందని స్పష్టంగా తెలుస్తోందని ఎరిక్సన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ నెట్‌వర్క్స్ హెడ్ ఫ్రెడ్రిక్ జెడ్లింగ్ అన్నారు. ఇక 2029 నాటికి ఫోన్‌ల ద్వారా మనం ప్రతి నెలా ఉపయోగించే డేటా మొత్తం 31GB నుంచి 75GBకి పెరుగుతుందని నివేదిక చెబుతోంది.
నేటి కంప్యూటర్ యూగంలో స్మార్ట్‌ఫోన్‌లు అందరికీ బెస్ట్ ఫ్రెండ్‌గా మారుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం, భారతదేశంలో, దాదాపు ప్రతి ఒక్కరూ తమ మొబైల్ కనెక్షన్‌ల కోసం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఇది 2023లో 82 శాతం నుంచి 2029 నాటికి 93 శాతానికి చేరుకోనుంది.