బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యం స్థాపిద్దాం .. జేఏసీగా ముందుకు వెళ్దాం: డాక్టర్ విశారదన్ మహరాజ్

బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యం స్థాపిద్దాం .. జేఏసీగా ముందుకు వెళ్దాం: డాక్టర్ విశారదన్ మహరాజ్
  • 93% ఉన్నా అధికారం దక్కించుకోలేకపోయామని వ్యాఖ్య
  • జేఏసీని దీపంలా కాపాడుకుందాం: జస్టిస్ ఈశ్వరయ్య
  • డబ్బులు తీసుకుని ఓటేస్తే రాజ్యాధికారం రాదు:  రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ  జేఏసీ బ్యానర్ ఆవిష్కరణ

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆ నాడు అన్ని పార్టీలు, సంఘాలు ఒక్కటై జేఏసీని స్థాపించాయని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ సమన్వయకర్త డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. అదే తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యం స్థాపించేందుకు తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యసాధన జేఏసీ అవసరమని భావించి ఈ వేదికను ప్రారంభిస్తున్నామన్నారు. బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణలో సామాజిక న్యాయం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సభ సోమవారం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమలి, జస్టిస్ ఈశ్వరయ్యతో కలిసి విశారదన్ మహారాజ్ కొత్త జేఏసీ బ్యానర్​ను ఆవిష్కరించారు. 

అనంతరం విశారదన్ మహారాజ్ మాట్లాడారు. ‘‘ఒక్కొక్కరికి ఒక్కో వేదిక ఉంటది. అందరికీ ఒకే వేదిక ఉండాలనే ఉద్దేశంతో బీసీ, ఎస్సీ, ఏస్టీ జేఏసీ ఏర్పాటు చేశాం. రాష్ట్ర ఏర్పాటులో కలిసి పోరాడాం. 93శాతం ఉన్న మనం.. అధికారం మాత్రం పొందలేకపోయాం. అగ్రవర్ణాలు అధికారం దక్కించుకున్నాయి. మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలని నిర్ణయించాం. దాని కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మన లక్ష్యం ప్రజలదాకా పోవాలి. వారిలో చైతన్యం తేవాలి’’అని విశారదన్ మహారాజ్ అన్నారు.

సామాజిక న్యాయం అంటే సమ న్యాయం:ప్రొఫెసర్ తిరుమలి

సామాజిక న్యాయం అంటే సమ న్యాయం, సమానమైన అధికార న్యాయమని ప్రొఫెసర్ తిరుమలి అన్నారు. రాజ్యాధికారం దగ్గర కావాలంటే జేఏసీ ముందుకు వెళ్లాలని సూచించారు. తెలంగాణ ఉద్యమం తర్వాత కొత్త జేఏసీ ఏర్పాటు చేసే చైతన్యం రావడం శుభపరిణామని తెలిపారు.10శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు.  పల్లెల్లో ఇప్పటికీ బానిసత్వం కనిపిస్తున్నదని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేకపోతే అసలు ఉద్యమాలే లేవన్నారు. ఇలాంటి తెలంగాణ తాము కోరుకోలేదని తెలంగాణ విట్టల్ అన్నారు. చనిపోయిన అమరవీరుల్లో తాను ఉంటే బాగుండు అని అనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల కష్టాన్ని అగ్రవర్ణాలు దోచుకుంటున్నాయని ఓయూ ప్రొఫెసర్ రామయ్య యాదవ్ మండిపడ్డారు.