ఖమ్మం జిల్లాలో ఓటెత్తిన టీచర్లు!

ఖమ్మం జిల్లాలో ఓటెత్తిన టీచర్లు!
  • ఖమ్మం జిల్లాలో 93.03 శాతం పోలింగ్ నమోదు 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 91.94 శాతం పోలింగ్
  • ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లు ముజామ్మిల్ ఖాన్, జితేశ్​వి పాటిల్
  • భద్రత మధ్య నల్గొండకు పోలింగ్ బాక్స్​ ల తరలింపు 

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్​ టీచర్​ ఎమ్మెల్సీ స్థానానికి గాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటల వరకు ఖమ్మం జిల్లాలో 93.03 శాతం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 91.94 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 6,111 మంది ఓటర్లకు గాను 5,663 మంది టీచర్లు ఓటేశారు. అక్కడక్కడా చిన్న ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మండలాల వారీగా పోలింగ్ బాక్స్​ లను ముందుగా జిల్లా కేంద్రాలకు తరలించి, ఆ తర్వాత ఆయా జిల్లా కేంద్రాల నుంచి పటిష్ట బందోబస్తు మధ్య నల్గొండకు తరలించారు. 

ఎక్కడ.. ఏ పరిస్థితి..?

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీగా ఎన్నికల బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులు నిలవగా, 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో 24, భద్రాద్రి జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో 4,089 మంది ఓటర్లు నమోదయ్యారు. వీరిలో 3,805 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అందులో 2,218 మంది పురుషులు, 1,587 మంది మహిళలు ఓటేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,022 మంది ఉపాధ్యాయ ఓటర్లున్నారు. మొత్తం 1,859 మంది ఓటేశారు. 973 మంది పురుషులు, 886 మంది మహిళా ఓటర్లు ఓటేశారు. పోలింగ్ జరుగుతున్న తీరును కలెక్టర్లు ముజామ్మిల్ ఖాన్, జితేశ్​ వి పాటిల్ వేర్వేరుగా పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో సీపీ సునీల్ దత్, కొత్తగూడెం జిల్లాలో ఎస్పీ బి.రోహిత్ రాజు పలు పోలింగ్ కేంద్రాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

 ఖమ్మంలో ఉదయం 10 గంటల వరకు 20.35 శాతం, మధ్యాహ్నం 12 గంటల వరకు 54.34 శాతం, మధ్యాహ్నం 2 గంటల వరకు 79.53 శాతం, సాయంత్రం 4 గంటలకు 93.05 శాతం పోలింగ్ నమోదైంది. భద్రాద్రి జిల్లాలో పోలింగ్ మందకొండిగా మొదలైంది. ఉదయం 10 గంటలకు కేవలం 8.61శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. 12 గంటల వరకు 46.44శాతం, 2 గంటలకు 73.39శాతం, 4 గంటల వరకు 91.94శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం శివరాత్రి కావడంతో చాలా మంది జాగారం చేయడంతో ఉదయం పూట పోలింగ్​ మందకొడిగా సాగింది. 

టీపీయూఎస్, యూటీఎఫ్​ నేతల మధ్య వాగ్వాదం

పోలింగ్ కేంద్రాలకు సమీపంలో అభ్యర్థుల తరపు అనుచరులు, యూనియన్ల నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. ఖమ్మం నగరంలోని రిక్కాబజార్​ స్కూల్​ ఆవరణలో నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం కాసేపు టీపీయూఎస్​, యూటీఎఫ్​ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్ల దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు ఉండడంపై మిగిలిన టీచర్ల సంఘాలు అభ్యంతరం చెప్పాయి. 

ఈ సందర్భంగా మోదీపై పలువురు అనుచిత కామెంట్లు చేశారంటూ బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా పోలీసులు జోక్యం చేసుకొని  టెంట్లు, ఫ్లెక్సీలను తొలగించారు. బీజేపీ నేతలను అదుపులోకి తీసుకోవడంతో పోలీసుల వాహనాలను కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారిని విడిచిపెట్టి, ఉపాధ్యాయులను తప్పించి మిగిలిన రాజకీయ పార్టీల ప్రతినిధులను అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఉద్రిక్తత సద్దుమణిగింది.

నల్గొండకు బాక్స్​ల తరలింపు.. 

 పోలింగ్ ముగిసిన తర్వాత ఉమ్మడి జిల్లాలోని పోలింగ్ బాక్స్​ లను నల్గొండలోని తెలంగాణ వేర్​ హౌసింగ్ గోడౌన్​ లకు తరలించారు. మార్చి 3న నల్గొండలో ఓట్ల లెక్కింపు జరగనుంది.