ఆకలి కేకలు ఓ వైపు ఆహార వ్యర్థాలు మరోవైపు!

ఆకలి కేకలు ఓ వైపు ఆహార వ్యర్థాలు మరోవైపు!

అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్న వేద భూమి మనది. మెతుకు విలువ తెలిసిన నేల నా దేశం. పళ్లెంలో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా దేవుడి ప్రసాదంలా భావించే రైతు శ్రమ ఫలం ఆదర్శప్రాయం. ఇలాంటి దేశంలో నిరుపేదలకు రెండు పూటల ఆహారం లేక ఆకలితో అలమటించేవారూ ఉన్నారు. ఇండియాలో కూడా ఆహారం వ్యర్థ పదార్థ రూపంలో డస్ట్​ బిన్‌ పాలు‌ కావడం శోచనీయం.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 931 మిలియన్ టన్నుల ఆహారం వ్యర్థ పదార్థంగా మారుతోంది. ఇండియాలో 68.7 మిలియన్ టన్నుల (వార్షిక తలసరి ఫుడ్‌ వేస్ట్ 50 కేజీలు) ఆహారాన్ని వ్యర్థ పదార్థంగా ఇంట్లోంచి చెత్తకుప్పలో వేస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్​ ప్రోగ్రామ్‌ నివేదిక కూడా బహిర్గత పరిచింది. 

ఆహార ఉత్పత్తిలో 17 శాతం వ్యర్థం

ఏడాదికి 690 మిలియన్ల ప్రజలు ఆకలి కోరల్లో, ముఖ్యంగా  కొవిడ్‌-19 కల్లోలం అనంతరం 3 బిలియన్ల ప్రజలు పోషకాహారానికి దూరంగా ఉన్నవేళ.. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 17 శాతం ఫుడ్‌ వేస్టేజ్‌ జరగడం విచారకరం.   వార్షిక తలసరి 50 కేజీల (దేశ ప్రజలు ఏడాదికి 68.8 మిలియన్‌ టన్నులు) ఆహారాన్ని వ్యర్థం చేస్తున్నారని నివేదిక తెలిపింది. అతి తక్కువ ఫుడ్‌ వేస్ట్ ఆస్ట్రియాలో వార్షిక తలసరి వ్యర్థాలు 39 కేజీలు ఉండగా, అత్యధికంగా నైజీరియాలో 189 కేజీలుగా నిర్ణయించడమైంది.

అమెరికాలో తలసరి ఫుడ్‌ వేస్ట్ 59 కేజీలు (19.4 మిలియన్‌ టన్నులు), చైనాలో ఏడాదికి  తలసరి ఫుడ్‌ వేస్ట్ 64 కేజీలు (91.6 మిలియన్‌ టన్నులు) ఉందని తేల్చింది. గృహాలు, హోటల్స్, రిటైల్‌ ఔట్‌లెట్స్‌ ద్వారా ఆహారం వ్యర్థం కావడం జరుగుతోంది. మాంసాహారం తరువాత మిగిలిన ఎముకలు, పీచు పదార్థాలు లాంటి తినడానికి వీలుకాని వ్యర్థాలను బయటవేయడం సర్వ సాధారణంగా జరుగుతుంది. కానీ, కొన్ని సంపన్న గృహాలు, శుభకార్యాలు, విందు భోజనాల అనంతరం మిగిలిన శుద్ధ ఆహారాన్ని డస్ట్ బిన్‌ లేదా వృథా చేయడం నేర సమానమని గమనించాలి.
 
ఆహార వ్యర్థంతో దుష్ప్రభావాలు

ఆహార ఉత్పత్తిలో అపార  రైతు శ్రమ , నీటి వినియోగం, ఎరువులు/క్రిమి సంహారకాలు, ఆర్థిక వనరులు, వ్యవసాయ వనరులు వినియోగించబడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఫుడ్‌ వేస్టేజ్‌తో వాతావరణ మార్పులు,  ప్రకృతి విధ్వంసం,  జీవ వైవిధ్యం, కాలుష్యం, నీటి కొరత, భూసారం, ఆర్థిక దుష్ప్రభావం, ప్రభుత్వ యంత్రాంగం, నిధుల వినియోగం, పౌర రైతు సేవలు సంబంధాన్ని కలిగి ఉంటాయని గుర్తుంచుకోవాలి.

ఆహార వ్యర్థాల ఫలితంగా 8 నుంచి10 శాతం గ్రీన్‌హౌస్​ గ్యాసెస్‌ విడుదల అవుతున్నాయని పరిశోధనలు చెపుతున్నాయి. విపత్తు రికవరీ ప్రణాళికల్లో ఆహార వ్యర్థాలను తగ్గించడం ప్రధాన అంశమని వివరిస్తున్నాయి. ఆహార వ్యర్థాలను తగ్గించే యజ్ఞంలో ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, వ్యాపార సామ్రాజ్యాలు, రైతులు, పౌర సమాజం, దాతృత్వ సంస్థలు, స్వచ్ఛంద  సంస్థలు సమన్వయంతో పనిచేయవలసి ఉంటుంది. 

ఆహార వృథా.. నేర సమానం

 దక్షిణ ఆసియా దేశాల్లో ఇండియాలో  గృహ తలసరి వార్షిక వ్యర్థాలు 50 కేజీలు ఉండగా,  అఫ్గనిస్తాన్‌లో 82 కేజీలు,  భూటాన్‌/నేపాల్‌లో 79 కేజీలు,  శ్రీలంకలో 76 కేజీలు,  పాకిస్తాన్‌లో 74 కేజీలు, బంగ్లాదేశ్‌లో 65 కేజీలు రికార్డు అయ్యాయి.  ఆహారాన్ని జీవ ఇంధనంగా భావించి,  ఒక్కొక్క మెతుకులో దాగిన కర్షక శ్రమను గౌరవించాలి. ఆహార వృథా నేర సమానమని, అదో  ఘోర క్రియగా భావించి బాధ్యతగా నడుచుకుంటూ మానవ జీవన వనరులను వృథా చేయకుండా కాపాడుకోవాలి. 

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి,ఎనలిస్ట్​