- ఓటేసేందుకు బారులుదీరిన కార్మికులు
- గనుల వద్ద పోటాపోటీగా ఓట్లు అభ్యర్థించిన సంఘాలు
గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్‌లో బుధవారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 93.77 శాతం పోలింగ్ జరిగింది. రామగుండం– 1, 2, 3 డివిజన్లలో 12,824 మంది కార్మికులకు గానూ 12,025 మంది ఓటేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. రామగుండం రీజియన్‌లో భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లు, డిపార్ట్‌మెంట్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా పోలీసులు, ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు. రామగుండం 1లో 5,384 ఓట్లకు 5,044(93.70 శాతం), రామగుండం 2 డివిజన్‌లో 3,556 ఓట్లకు 3,369(94.74 శాతం)
రామగుండం 3 డివిజన్‌లో 3,884 ఓట్లకు గాను 3,612(92.9శాతం) ఓట్లు పోలయ్యాయి. ఓటేసేందుకు కార్మికులు క్యూలైన్లలో బారులుదీరారు. ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడగా ఆయా యూనియన్లకు చెందిన లీడర్లు పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో టెంట్లు వేసుకుని కార్మికులను ఓట్లు అభ్యర్థించారు. కాగా ఎన్నికల నేపథ్యంలో వైన్స్‌షాపులను మూసేశారు.. కొందరు కార్మికులు గనుల వద్ద నినాదాలు చేస్తూ హడావుడి సృష్టించారు.
పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (సెంట్రల్), ఏఆర్‌వో నర్సయ్య, జనరల్ మేనేజర్లు చింతల శ్రీనివాస్, ఎల్‌వీ సూర్యనారాయణ, సుధాకర్‌రావు, వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.