నిజామాబాద్ చివరి రోజు నామినేషన్ల వెల్లువ

నిజామాబాద్, కామారెడ్డి టౌన్, ​వెలుగు: నిజామాబాద్​లోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో (బాన్సువాడతో కలిపి) ఆఖరు రోజు మొత్తం 95 నామినేషన్లు వచ్చాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్​నామినేషన్ వేశారు.  కొందరు అభ్యర్థులు తమ భార్య, చెల్లి, కొడుకులతో నామినేషన్లు వేయించారు. పొలిటికల్ ​పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు పోటీకి సిద్ధపడి నామినేషన్లు వేశారు. ఈనెల 3న నామినేషన్ల స్వీకరణ షురూ కాగా శుక్రవారం ముగిసేనాటికి జిల్లాలో మొత్తం 165 నామినేషన్లు దాఖలయ్యాయి.

అత్యధికంగా అర్బన్ నియోజకవర్గం నుంచి 46, ఆర్మూర్​నుంచి 35, బోధన్​లో 28, రూరల్​లో 20, బాన్సువాడ, బాల్కొండలో 18 చొప్పున నామినేషన్లు అందాయి. కామారెడ్డిలో చివరి రోజు 21 మంది 45 సెట్లు, ఎల్లారెడ్డిలో 16 మంది 27 సెట్లు, జుక్కల్​లో 17 మంది 24 సెట్ల నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా కామారెడ్డిలో 103, ఎల్లారెడ్డిలో 42, జుక్కల్​లో 50 సెట్ల నామినేషన్లు వచ్చాయి.  కామారెడ్డిలో కాంగ్రెస్​ అభ్యర్థి రేవంత్​రెడ్డి నామినేషన్​ వేశారు. బీఆర్ఎస్ ​అభ్యర్థి కేసీఆర్​తరఫున ఆ పార్టీ లీడర్లు రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి తరఫున కూడా ఆ పార్టీ లీడర్లు నామినేషన్ ​వేశారు.

తల్లి ఆశీర్వాదంతో..

ఎల్లారెడ్డి బీఆర్ఎస్​ అభ్యర్థి, సిట్టింగ్ ​ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం నామినేషన్​ దాఖలు చేశారు. సురేందర్​ సొంత గ్రామమైన లింగంపేట మండలం నల్లమగుడు లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన తల్లి హన్మవ్వ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఎల్లారెడ్డిలో నామినేషన్​ వేశారు. 2018లో సురేందర్ ​కాంగ్రెస్​ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం బీఆర్​ఎస్​లో చేరారు. ఈ ఎన్నికల్లో మొదటిసారి బీఆర్ఎస్​ నుంచి పోటీ చేస్తున్నారు.-  
– లింగంపేట