
న్యూఢిల్లీ: 2028 నాటికి 98శాతం పర్సనల్కంప్యూటర్ల (పీసీలు)లో ఏఐ ఫీచర్లు ఉంటాయని డెల్ టెక్నాలజీస్ ఇండియా క్లయింట్ సొల్యూషన్స్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ ఇంద్రజిత్ బెల్గుండి వెల్లడించారు. కంపెనీ కొత్త పీసీలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వయస్సుల వాళ్లు, కంపెనీలు ఏఐ పీసీలను పెద్ద ఎత్తున వాడుతున్నాయని తెలిపారు. "2028 నాటికి దాదాపు 98 శాతం పీసీలు కొత్త ఎన్పీయూలు (న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్లు)తో కూడిన ఏఐ పీసీలు అవుతాయి. మనం ఏఐ పనులను ఫోన్లలోనే చేసుకోవచ్చు.
పీసీలు వేగంగా, మరింత సురక్షితంగా, -సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇండియన్ పీసీ మార్కెట్గ్రోత్ బాగుంది. గేమింగ్, ఏఐ ఆధారిత పీసీలకు గిరాకీ పెరుగుతోంది”అని ఆయన వివరించారు. డెల్ బుధవారం ఇంటెల్ కోర్ అల్ట్రా, ఏఎండీ రైజెన్ ప్రాసెసర్‌లతో పాటు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ కోపైలట్ ప్లస్ ఏఐ పీసీలను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త లైనప్‌లో డెల్ ప్రో 14 , 16, డెల్ ప్రో 13, 14, 16 ప్లస్, డెల్ ప్రో 13, 14 ప్రీమియం పీసీలు ఉన్నాయి. భారతదేశం తమకు ప్రపంచంలోని టాప్ ఐదు మార్కెట్లలో ఒకటని ఇంద్రజిత్ చెప్పారు. ఐటీ హార్డ్‌వేర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం మొదటి దశలో కంపెనీ పాల్గొందని వెల్లడించారు. డెల్ 2025 ఆర్థిక సంవత్సరంలో 95.6 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది. ఇది ఏడాదికి 8 శాతం పెరిగింది. కంపెనీ ఫిబ్రవరి–-ఫిబ్రవరి క్యాలెండర్‌ను అనుసరిస్తుంది. మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐడీసీ ప్రకారం, డెల్ టెక్నాలజీస్‌కు భారతదేశ పీసీ మార్కెట్లో 16.1 శాతం వాటా ఉంది.