హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అన్నికోర్టులో జరిగిన లోక్ అదాలత్ తో 9.87 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. పెండింగ్ కేసులు 5.43 లక్షలు, ప్రాథమిక దశలోనివి 4.44 లక్షలు చొప్పున కేసులు ఉన్నాయి. కక్షిదారులకు రూ.2.22 కోట్లు పరిహారాన్ని ప్రకటించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ పరిపాలనాధికారి జి. కళార్చన తెలిపారు.హైకోర్టులో నిర్వహించిన లోక్అదాలత్లో 231 కేసులు పరిష్కారం అయ్యాయి.
ఇందులో మోటారు వాహన చట్టం కింద 140కేసులు, కార్మికుల పరిహారం వివాదానికి చెందిన 28 కేసులున్నాయి. రూ.16.40 కోట్ల పరిహారాన్ని ప్రకటించడం ద్వారా 1200 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని చెప్పారు. బీమా పరిహార సంబంధిత 3 కేసుల్లో రూ.2.95 కోట్లు పరిహార ఉత్తర్వులు జారీ అయ్యాయి.హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె .అనిల్ కుమార్, రిటైర్ న్యాయమూర్తి జస్టిస్ జి . శ్రీదేవి కేసులను విచారించారు.
సైబర్ఫ్రాడ్బాధితులకు రూ.26కోట్లు అప్పగింత
సైబర్ నేరగాళ్ల బారినపడిన బాధితులకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండగా నిలుస్తున్నది. బాధితులు పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నది. శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో రాష్ట్ర వ్యాప్తంగా 5,245 మంది బాధితులకు చెందిన రూ.26.2 కోట్లు అప్పగించింది. జూన్ 9వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఫ్రీజ్ చేసిన డబ్బును రీ ఫండ్ చేసింది. గత లోక్ అదాలత్ లో 4,800 మంది బాధితులకు రూ.21.6 కోట్లు రీఫండ్ చేసింది.