టీచర్లులేకుండా..చదువు సాగేదెలా

టీచర్లులేకుండా..చదువు సాగేదెలా
  •      సంగారెడ్డి జిల్లాలో 989  పోస్టులు ఖాళీ
  •      డీఎస్సీ ద్వారా  551 పోస్టుల భర్తీకి  పరీక్షలు
  •      రిజల్ట్స్​ కోసం అభ్యర్ధుల నిరీక్షణ

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా స్కూళ్లను  టీచర్ల కొరత వేధిస్తోంది.  దాదాపు వెయ్యి టీచర్​ పోస్టులు ఖాళీగా ఉండడం విద్యారంగం మీద ప్రభావం చూపుతోంది.  జిల్లాకు సాంక్షన్​ స్ట్రెంథ్​ మేరకు   బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  పోస్టులను భర్తీ చేయలేదు.  జిల్లా వ్యాప్తంగా మొత్తం పోస్టులు 6,016 ఉండగా, ప్రస్తుతం  5,027 మంది టీచర్లు మాత్రమేపని చేస్తున్నారు.   ఇంకా  989 పోస్టులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం మొదట్లో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తారనుకుంటే  తాత్కాలిక సర్దుబాట్లతో సరిపెట్టారు.  

జిల్లాలో  మొత్తం 1,247 ప్రభుత్వ పాఠశాలలుండగా దాదాపు 1.13 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు.  జిల్లాలో  551 టీచర్​ పోస్టులను  భర్తీ చేసేందుకు  డీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ వేసి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించారు. వీటి రిజల్ట్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.  ఈ నెలాఖరు వరకు ఫలితాలు విడుదల చేసి  రెండు నెలల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్టు  విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ భర్తీ  జరిగితే 8 ఏళ్ల నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడనుంది.

డిప్యూటేషన్ల ద్వారా సర్దుబాటు 

జిల్లాలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో  ఆ ప్రభావం బోధన మీద పడకుండా చూసేందుకు  జిల్లా విద్యాశాఖ 150 మంది టీచర్లకు  డిప్యూటేషన్ ఇచ్చి  సర్దుబాటు చేసింది. స్టూడెంట్స్ సంఖ్య కన్నా టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న స్కూళ్ల నుంచి కొందరిని ఖాళీలు  ఉన్నచోటికి పంపించారు.  జిల్లాలో 58 జీరో ఎన్​రోల్​మెంట్​  స్కూల్స్   ఉండగా, ఇక్కడ  పనిచేసే టీచర్లను దగ్గరలో ఉన్న పాఠశాలలకు పంపించారు. అయితే ఈ సర్దుబాటు వ్యవహారంలోనూ  నిబంధనలు పాటించలేదన్న   విమర్శలొచ్చాయి.   కొంతమంది టీచర్లు పైరవీలు చేసుకుని తమకు అనుకూలంగా ఉన్న చోటికి  వెళ్లారన్న ప్రచారం జరిగింది.

మండల పరిధిలో  డిప్యూటేషన్లు ఇవ్వాల్సిఉండగా  సర్దుబాటు పేర ఇతర మండలాలకు కూడా పంపారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి.  జిల్లాకు 232 అకడమిక్ ఇన్స్ స్ట్రక్టర్ల అవసరం ఉంది. ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు తాత్కాలికంగా అకడమిక్ ఇన్స్ స్ట్రక్టర్లను నియమించాలని జిల్లా విద్యాశాఖ ప్లాన్ చేసింది. ఈ మేరకు  ప్రభుత్వానికి నివేదిక పంపించింది. రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఇంకా అనుమతి రాలేదు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే తమకు అవకాశం లభిస్తుందని పలువురు  నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.