కుంభమేళాలో ఒక్క రోజే 99 లక్షల మంది పుణ్యస్నానం.. ఇప్పటి వరకు 55 కోట్లకు పైగా భక్తులు హాజరు

కుంభమేళాలో ఒక్క రోజే 99 లక్షల మంది పుణ్యస్నానం.. ఇప్పటి వరకు 55 కోట్లకు పైగా భక్తులు హాజరు

ప్రయాగ్​రాజ్, న్యూఢిల్లీ: మహా కుంభ మేళాకు రద్దీ కొనసాగుతోంది.. మరో వారం రోజుల్లో మేళా ముగియనుండడంతో జనం పెద్ద సంఖ్యలో ప్రయాగ్​రాజ్​ చేరుకుంటున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి తిరుగుముఖం పడుతున్నారు. సోమవారం ఒక్క రోజే 99 లక్షలకు పైగా భక్తులు సంగమంలో పుణ్య స్నానం చేశారని అధికారులు తెలిపారు. ఈ నెల 26న చివరి రోజు మరో ప్రధాన ఘట్టం మిగిలి ఉందని, అదేరోజు మహాశివరాత్రి కావడంతో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 

ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కాగా, ఇప్పటి వరకు మహా కుంభమేళాకు 55 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని, ప్రపంచంలో ఓ ఆధ్యాత్మిక వేడుకకు ఈ స్థాయిలో భక్తులు హాజరుకావడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. మరోవైపు, భక్తుల రద్దీ కారణంగా గంగా నది ఒడ్డున కొన్నిచోట్ల నీటిలో బ్యాక్టీరియా పెరిగిపోయిందని, అక్కడి నీరు స్నానానికి సరిపడవని అన్నారు. ఈమేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కు అందజేసిన రిపోర్టులో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ విషయాన్ని వెల్లడించింది. స్నాన ఘట్టాల వద్ద భక్తుల రద్దీ కారణంగా నీటిలో బ్యాక్టీరియా లెవల్స్ పెరిగిపోయాయని చెప్పింది.

మహా కుంభమేళా కాదు.. మృత్యు కుంభ్‌‌: మమత

మహాకుంభ మేళా ఏర్పాట్లలో లోపాలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. నిర్వహణ లోపాల వల్ల మహాకుంభ్​ 'మృత్యుకుంభ్'‌‌గా మారుతోందని విమర్శించారు. ఈమేరకు మంగళవారం బెంగాల్​ అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. "ఇది మృత్యుకుంభ్. నేను మహాకుంభ మేళాను గౌరవిస్తాను. గంగామాతనూ గౌరవిస్తాను. కానీ.. అక్కడ సరైన ప్లానింగ్ లేదు. 

డబ్బున్న వాళ్లకు, వీఐపీలకు మాత్రమే బస చేసేందుకు క్యాంపులు (టెంట్లు) దొరుకుతున్నాయి. పేదలకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. మేళాలో తొక్కిసలాట జరగడం సహజమే.. కానీ అంచనాకు తగిన ఏర్పాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకు మీరు(బీజేపీ) ఎలాంటి ప్లానింగ్ చేశారు" అంటూ కేంద్రం, యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని మమత నిలదీశారు. జనవరి 29న జరిగిన మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనలో చాలా మంది చనిపోయారని..కానీ వారి పేర్లను ప్రభుత్వాలు ఇంకా ప్రకటించలేదని ఆరోపించారు. 

తిరిగివెళ్తూ ఐదుగురు మృతి

కుంభమేళాకు హాజరై ఇంటికి బయలుదేరిన భక్తులు ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. రాజస్థాన్​లోని దౌసా బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఓ ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో కారులోని ప్రయాణికులు ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు  గాయపడ్డారు. వాహనదారుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కు పోయిన మృతదేహాలను వెలికితీశారు. మృతులంతా టోంక్ జిల్లాలోని డియోలి నివాసితులు అని పోలీసులు తెలిపారు.