- అలాగే నీళ్లు వదులుతున్న ఇరిగేషన్ ఆఫీసర్లు
- 99 ప్యాకేజీ డీ2 కెనాల్ కింద 100 ఎకరాలకు పైగా నష్టం
- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన రైతులు.. అయినా తీరని సమస్య
గద్వాల, వెలుగు: నెట్టెంపాడు కింద డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కంప్లీట్ చేయకుండానే నీళ్లు వదులుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలాచోట్ల నీళ్లు వృథాగా పోవడమే కాదు.. కెనాల్స్ పనులు మధ్యలోనే వదిలేయడంతో చుట్టూ ఉన్న పంటలు మునుగుతున్నాయి. 99 ప్యాకేజీలోని డీ2 కెనాల్ కింద 100 ఎకరాలకు పైగా పంట పొలాలు మునుగుతున్నాయి. మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉందని ఇరిగేషన్ ఆఫీసర్లకు చెప్పినా, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
గుడ్డెండొడ్డి కింద 28 వేల ఎకరాల ఆయకట్టు
నెట్టెంపాడు లిఫ్ట్‌లో భాగమైన ధరూర్ మండలంలోని గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల అస్తవ్యస్తంగా ఉంటోంది. 1.6 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ కింద 98,99,100,101 ప్యాకేజీలు ఉన్నాయి. మెయిన్ కెనాల్స్‌తో పాటు డిస్ట్రిబ్యూటరీల ద్వారా 28 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ డిస్ట్రిబ్యూటరీలు లేకపోవడంతో సగానికి కూడా నీళ్లు అందడం లేదు. చాలాచోట్ల రైతులు మెయిన్ కెనాల్స్ నుంచి మోటార్ల ద్వారా పారించుకుంటున్నారు. కొన్ని చోట్ల పిల్ల కాలువలను సగం వరకు తవ్వ వదిలేశారు. ప్రస్తుతం వీటికి నీళ్లు ఇస్తుండడంతో పంటలు మునుగుతున్నాయి. 99 ప్యాకేజీలోని డీ2 కెనాల్ కింద గార్లపాడు శివారులో 60 ఎకరాలు, నాగర్ దొడ్డి శివారులోని దాదాపు 40 ఎకరాలు పంటల నష్టపోయాయి.
నిరుడు 300 ఎకరాలు నాశనం
సీజన్ వచ్చినా రిజర్వాయర్ నుంచి ఆఫీసర్లు నీటిని విడుదల చేయకపోవడంతో రైతులే ఇష్టానుసారంగా నీటిని వదులుతున్నారు. నిరుడు గుర్తుతెలియని రైతులు షట్టర్‌ను పైకి ఎత్తగా మళ్లీ కిందికి దిగలేదు. దీంతో కాలువలు తెగిపోయి దాదాపు 300 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇసుక మేటలు కూడా వేయడంతో ఆ రైతులు ఇప్పటికీ కోలుకోలేదు.
99వ ప్యాకేజీ పనులు పెండింగ్ లోనే
10 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న నెట్టెంపాడు లిఫ్టులోని 99వ ప్యాకేజీ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పిల్లకాలువలే కాదు మెయిన్ కెనాల్ కూడా రెండు కిలోమీటర్ల మేర అసంపూర్తిగా ఉంది. పనులు చేయాల్సిన కాంట్రాక్టర్ అడ్రస్ లేకుండా పోవడంతో మెయింటెనెన్స్‌కు కూడా దిక్కూదివాణం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆఫీసర్లు ఆ కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చి మరో కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయిస్తున్నారు. ఈ ప్యాకేజీ కింద ఉన్న డీ1, డీ2, డీ3 కెనాల్స్‌లో ఒక్కటి కూడా పూర్తికాలేదు.
మూడేళ్ల నుంచి తిరుగుతున్న
నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ సగం వరకు తవ్వి వదిలేయడంతో నీళ్లు వదిలినప్పుడల్లా పొలాలు మునుగుతున్నయి. దాదాపు 60 మంది రైతులు ఇబ్బందులు పడుతున్నం. సమస్య పరిష్కరించాలని మూడేళ్ల నుంచి తిరుగుతున్నా ఆఫీసర్లు పట్టించకుంటలేరు. చివరి వరకు కాలువ తవ్వేందుకు చందాలు వేసుకొని పైసలిస్తామన్నా స్పందిస్తలేరు.
–రవి, రైతు, గార్లపాడు
సమస్య పరిష్కరిస్తం
99 వ ప్యాకేజీలో కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంతో కొన్ని కాలువలు పెండింగ్ లో ఉన్నయి. నోటీసులు ఇచ్చిన ఆయన స్పందించడం లేదు. రైతులకు సమస్య రాకుండా పనులు చేపడుతం. ఏఈని పంపించి గార్లపాడు శివారులో సమస్యను పరిష్కరిస్తం.
–రహీముద్దీన్, ఈఈ, నెట్టెంపాడు ప్రాజెక్ట్