యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. బొమ్మలరామారం మండలం హజీపూర్ లో కనిపించకుండా పోయిన శ్రావణి అనే స్కూల్ విద్యార్థిని హత్యకు గురైంది. స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న బాలిక… స్పెషల్ క్లాస్ ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. విచారణ చేపట్టిన పోలీసులు… గ్రామంలోని ఓ బావిలో శ్రావణి మృతదేహాన్ని గుర్తించారు. ఎవరో హత్యచేసి మృతదేహాన్ని బావిలో పాతిపెట్టారని అనుమానిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో డాగ్ స్క్యాడ్, క్లూస్ టీమ్ తనిఖీలు చేపట్టింది. హత్య జరిగిన కొద్ది దూరంలో మద్యం సీసాలు గుర్తించారు.
అంతకుముందు బాలికను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ఆందోళనకు దిగారు గ్రామస్ధులు. బావిలోంచి మృతదేహాన్ని తీయకుండా అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన DCP వాహనంపై దాడి చేసి.. అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులకు, గ్రామస్థులకు వాగ్వాదం జరగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తర్వాత గొడవ సద్దుమణగడంతో భారీ బందోబస్తు మధ్య మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు పోలీసులు.
ఎస్‌ఐపై వేటు
ఈ కేసు విషయంలో బొమ్మలరామారం ఎస్‌ఐ వెంకటయ్యపై ప్రభుత్వం వేటు వేసింది. హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌చేస్తూ భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం వహించారని ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు.