సీఎం టూర్ పై ఆఫీసర్లతో రివ్యూ

సీఎం టూర్ పై ఆఫీసర్లతో రివ్యూ

వరంగల్/ వరంగల్​సిటీ, వెలుగు: ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించారు. పలు పనులను పరిశీలించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, ఇతర ప్రతిపాదిత అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టరేట్ లో ఆయన సమీక్షించారు.

కుడా ఆధ్వర్యంలో చేపడుతున్న కాళోజీ కళా క్షేత్రం, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి చేపడుతున్న భూ సేకరణ, వరంగల్ బస్టాండ్ నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, స్మార్ట్ సిటీ, ఎయిర్​పోర్ట్, కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్క్ తోపాటు పలు అభివృద్ధి పనుల పురోగతిపై హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే తదితర శాఖల అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా అజిత్ రెడ్డి మాట్లాడుతూ ఆయా పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవోలు వెంకటేశ్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు స్పెషల్​సెక్రటరీ వరంగల్​కలెక్టర్​తో కలిసి ఎంజీఎంను సందర్శించి, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. రాత్రి వేళలో డ్యూటీ చేసే వారికి రక్షణ కల్పించాలని సూరింటెండెంట్​మురళిని ఆదేశించారు. శిథిలావస్థలో నర్సింగ్​భవనాన్ని పరిశీలించి విద్యార్థుల వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రేటర్​వరంగల్​బల్దియా ప్రాంగంణంలో కొత్తగా నిర్మించిన భవనాన్ని మేయర్​సుధారాణితో కలిసి పరిశీలించారు.