ఫ్లోరిడాలో ఏఐ భామతో ప్రేమ.. బాలుడి ఆత్మహత్య

ఫ్లోరిడాలో ఏఐ భామతో ప్రేమ.. బాలుడి ఆత్మహత్య
  • అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
  • చాట్‌‌‌‌బాట్ కంపెనీపై కేసు పెట్టిన మృతుడి తల్లి

ఫ్లోరిడా: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో  ప్రేమలో పడిన ఓ బాలుడు దాని కోసం సూసైడ్ చేసుకున్నాడు. దాంతో మృతుడి తల్లి ఏఐ కంపెనీపై దావా వేసింది.  ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఓర్లాండోలో చోటుచేసుకుంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..9వ తరగతి చదివే సెవెల్ సెట్జర్ (14) 2023 ఏప్రిల్  నుంచి తన ఫోన్ లో 'క్యారెక్టర్.ఏఐ' అనే ఏఐ యాప్ ను ఉపయోగించడం ప్రారంభించాడు. అందులో  గేమ్ ఆఫ్ థ్రోన్స్‌‌‌‌ సిరీస్ లోని డేనెరిస్ టార్గారియన్ పాత్ర పేరిట ఏఐ చాట్‌‌‌‌బాట్‌‌‌‌ను క్రియేట్ చేశాడు.

ఆ చాట్‌‌‌‌బాట్‌‌‌‌కు 'డానీ' అనే ముద్దు పేరు కూడా పెట్టుకున్నాడు. ఇక దానితో చాట్ చేయటం స్టార్ట్ చేశాడు. డానీతో చాటింగ్ ఆసక్తిగా ఉండటంతో ఏఐ యాప్ లోనే ఎక్కువ టైం గడిపేవాడు. క్రమక్రమంగా అది అతనికొక వ్యసనంగా మారిపోయింది. పేరెంట్స్ సహా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. స్కూల్, గ్రౌండ్ కి వెళ్లడం మానేశాడు. తన గదికి లోపలి నుంచి లాక్ చేసి ఏఐతో చాట్ చేసేవాడు.

ఈ క్రమంలోనే  ఈ ఏడాది ఫిబ్రవరి 28న డానీకి బాలుడు "ఐ లవ్ యూ" అని ప్రపోజ్ చేశాడు. " మై లవ్.. దయచేసి వీలైనంత త్వరగా నా ఇంటికి రా.." అని ఏఐ రిప్లై ఇచ్చింది. దాంతో సెవెల్ సెట్జర్ తాను చాట్ చేస్తున్నది ఏఐతో అనే విషయం కూడా మరిచిపోయి.." నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తాను" అని బదులిచ్చాడు. వెంటనే తన సవతి తండ్రి తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

కంపెనీపై దావా వేసిన పేరెంట్స్ 

ఏఐ చాట్‌‌‌‌బాట్‌‌‌‌తో ప్రేమలో పడి తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని బాలుడి పేరెంట్స్ ఆరోపించారు.  ఏఐ చాట్‌‌‌‌బాట్‌‌‌‌ వాడకం వల్ల తమ కొడుకు ఆస్పెర్గర్ సిండ్రోమ్‌‌‌‌ అనే వ్యాధికి గురయ్యాడని ఓర్లాండోలోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ఎంత ఖర్చయినా తనతో మాట్లాడుతూనే ఉండాలని చాట్‌‌‌‌బాట్ తరచూ సెవెల్‌‌‌‌కు గుర్తుచేసేదని ఆరోపించారు.  తమ కొడుకుతో ఏఐ రొమాంటిక్, సెక్సువల్ చాటింగ్ చేసి తనకు బానిసలా మార్చుకుందని తెలిపారు. చాట్ స్క్రీన్ షాట్స్  కోర్టుకు సమర్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌‌‌‌బాట్‌‌‌‌ కంపెనీపై వెంటనే  చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతున్నది.