
జైపూర్: ఓ పెండ్లి వేడుక చూడడానికి బయటకు వచ్చిన దళిత యువకుడి(19) ని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి, అతి దారుణంగా కొట్టారు. అంతేకాకుండా అతడితో బలవంతంగా బట్టలు విప్పించి అసహజంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై మూత్రం పోశారు.
ఈ ఘటనను వీడియో తీశారు. విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వీడియో పెడతామని బెదిరించారు. రాజస్థాన్లో సీకర్ జిల్లాలోని ఫతేపూర్లో ఈనెల 8న ఈ దారుణ ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
పెండ్లి వేడుక చూడడానికి బయటకు వచ్చిన యువకుడిని పని ఉందంటూ నిందితులు కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాటిల్ తో విచక్షణారహితంగా కొట్టారు. ప్రైవేటు భాగాల మీదా దాడి చేశారు. కులం పేరుతో బాధితుడిని తిట్టారు. అయితే, బాధితుడి తండ్రిపై నిందితులు పగతో ఉన్నారు. ఆ కోపంతో యువకుడిపై దాడి చేశారు.