
- కార్డియోమయోపతి సమస్యతో ప్రాణాలకు ముప్పు
- బ్రెయిన్ డెడ్ యువకుడి నుంచి గుండె సేకరించి మార్పిడి
- జీవన్ దాన్ ద్వారా సేకరణ.. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆపరేషన్
- కోలుకుంటున్న యువకుడు.. వారం, పది రోజుల్లో డిశ్చార్జ్
- డాక్టర్లకు, డోనర్ ఫ్యామిలీకి మంత్రి దామోదర అభినందనలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో డాక్టర్లు ఓ యువకుడికి గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. డైలేటెడ్ కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్న యువకునికి, యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ డెడ్ అయిన మరో యువకుడి గుండెను అమర్చారు. జీవన్ దాన్ ద్వారా గుండెను సేకరించి శుక్రవారం ఆపరేషన్ చేశారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ కు చెందిన పూజారి అనిల్ కుమార్(19) కొన్నేండ్లుగా డైలేటెడ్ కార్డియోమయోపతి(డీసీఎంపీ) సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్య ఉన్న రోగుల్లో గుండె సైజు మూడు, నాలుగు రెట్లు పెరుగుతుంది. దీంతో గుండె గోడలు పలుచబడి, గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. బాడీ మొత్తం నీరు చేరి కాళ్లు, చేతులు, పొట్ట భాగం, ముఖంపై వాపు వస్తుంది. గుండె మార్పిడి చేయకపోతే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అనిల్ కు రెండు నెలల క్రితం సమస్య తీవ్రం కావడంతో నిమ్స్ లో జాయిన్ చేశారు. అప్పటి నుంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
జీవన్ దాన్ ద్వారా గుండె సేకరణ
డాక్టర్ల సూచన మేరకు అనిల్ బంధువులు జీవన్ దాన్ లో గుండె దాత కోసం పేరును నమోదు చేసుకున్నారు. రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడి(21)కి బ్రెయిన్ డెడ్ అయినట్టు సికింద్రాబాద్ కిమ్స్ డాక్టర్లు కన్ఫమ్ చేశారు. దీంతో అతని కుటుంబసభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ కావడంతో డాక్టర్లు గుండె మార్పిడికి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం రోడ్డు మార్గం ద్వారా గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి గుండెను కిమ్స్ నుంచి నిమ్స్ కు తరలించారు. కార్డియోథొరాసిక్ హెచ్ వోడీ అమరేశ్వర రావు, డాక్టర్లు గోపాల్, కళాధర్, అనస్తీషియా డాక్టర్ నర్మద సహా 30 మందితో కూడిన వైద్య బృందం మూడు గంటల్లో గుండె మార్పిడి పూర్తిచేసింది. ప్రస్తుతం అనిల్ కోలుకుంటున్నాడని, వారం, పది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు.
ఉచితంగానే ఆపరేషన్
ప్రైవేట్ దవాఖాన్లలో గుండె మార్పిడి ఆపరేషన్లు చేయించుకోవాలంటే దాదాపు రూ. 40 లక్షలు ఖర్చు అవుతుంది. అనిల్ కు మాత్రం ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ నిధులతో గుండెమార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు. నిమ్స్ డాక్టర్లు, సిబ్బంది, అవయవ దానం చేసిన కుటుంబానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా అభినందనలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అవయవ మార్పిడులను పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. గాంధీలో త్వరలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ అందుబాటులోకి వస్తుందన్నారు. బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవదానానికి ముందుకు వచ్చి, ప్రాణదాతలుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, నిమ్స్ లో ఇప్పటివరకూ 15 గుండె మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే 2 లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్లు, ఒక కంబైన్డ్ లంగ్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అవయవ మార్పిడిలో సహకారం కోసం అమెరికాలోని టెక్సాస్ సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీతో నిమ్స్ ఎంఓయూ కుదుర్చుకున్నదని వివరించారు.