26 ఏళ్ల ఐటీ ఉద్యోగి.. సైకిల్ మారథాన్లో గుండెపోటు

గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇవి వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వ్యాయామం చేస్తూనో, చేసిన తర్వాతో గుండెపోటుతో యువకులు కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ప్రతిరోజూ డైట్ పాటిస్తున్న వారు, జిమ్ చేస్తున్న వారు, హెల్దీగా ఉంటున్న వారు కూడా గుండెపోటుకు గురవుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గోవాలో జరిగింది. 26 ఏళ్ల ఐటీ ఉద్యోగి.. సైకిల్ మారథాన్ లో గుండెపోటుతో ప్రాణం విడిచాడు. 

బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల టెక్కీ ఆదివారం రోజు సైకిల్ మారథాన్ (ట్రైయాథ్లాన్​ ఎండ్యూరెన్స్) రేసులో కుప్పకూలిపోయాడు. ఒక రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆదివారం రోజు (అక్టోబర్ 8వ తేదీన) నిర్వహించిన ఐరన్ మ్యాన్ 70.3 గేమ్ లో కామాఖ్య సిద్ధార్థ్​ శ్రీవాస్తవ అనే ఐటీ ఉద్యోగి పాల్గొన్నాడు. కాసేపట్లో గేమ్ ముగియబోతున్న సమయంలో అతడికి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి.. కుప్పకూలిపోయాడు.

అక్కడే డాక్టర్లు సిద్ధార్థ్​ కు అత్యవసర చికిత్స అందించారు. ఆ తర్వాత వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఒకరోజుంతా చికిత్స పొందిన సిద్ధార్థ్​ .. ఆ తర్వాత చనిపోయాడు. జార్ఘండ్​ రాంచీకి చెందిన శ్రీవాస్తవ బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో తనను తాను అడ్రినలిన్ జంకీగా రాసుకున్నాడు. గతంలో తాను అనేక క్రీడా పోటీల్లో పాల్గొన్న విజువల్స్​ ను ఒక డాక్యుమెంటు రూపంలో తయారు చేసి, ఇన్ స్టాలో పోస్టు చేశాడు. 

ఆదివారం (అక్టోబర్ 8న) గోవాలో 1.9 కిలోమీటర్ల ఈత, 90 కిలోమీటర్ల సైకిల్​ రైడ్, 21.1 కిలోమీటర్ల పరుగు పందెం, సైకిల్ మారథాన్ రేస్ ను ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రేసులో 50కి పైగా దేశాల నుంచి వచ్చిన అథ్లెట్లు పాల్గొన్నారు.