బెంగళూరుకు ఏంటీ దరిద్రం: భార్యా బాధితుల వరస ఆత్మహత్యలు.. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులే !

బెంగళూరుకు ఏంటీ దరిద్రం: భార్యా బాధితుల వరస ఆత్మహత్యలు.. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులే !

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో భార్యా బాధితుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతుల్ సుభాష్ ఆత్మహత్య వార్తల్లో నిలిచిన నెలల వ్యవధిలోనే తాజాగా బెంగళూరులో మరో ఘటన కలకలం రేపింది. 40 ఏళ్ల వయసున్న ఒక మార్కెటింగ్ ఉద్యోగి బెంగళూరులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక టెక్ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో ప్రశాంత్ నాయర్ సీనియర్ లెవెల్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

అతనికి పూజా నాయర్ అనే మహిళతో 12 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఆమె కూడా ‘డెల్’ మల్టీ నేషనల్ కంపెనీలో కొన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తోంది. ఈ భార్యాభర్తలకు ఎనిమిదేళ్ల వయసున్న పాప కూడా ఉంది. ఒక సంవత్సరం క్రితం భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో అప్పటి నుంచి విడిపోయి ఎవరికి వారుగా జీవిస్తున్నారు. విడిగా ఉంటున్నప్పటికీ ఈ ఇద్దరికీ విడాకుల విషయంలో గొడవ నడుస్తూ ఉంది. 

ప్రశాంత్ నాయర్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు. తన కొడుకు, కోడలు విడివిడిగా ఉంటున్నారని.. శుక్రవారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత తన కొడుకుకు ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read:-వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క.. సీన్ లోకి పోలీసుల ఎంట్రీ.. ఏం జరిగిందంటే..

అతని ఇంటికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రశాంత్ నాయర్ తండ్రి చెప్పుకొచ్చారు. భార్యతో నెలకొన్న విభేదాలు, తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా తన కొడుకు ప్రాణం తీసుకున్నాడని ప్రశాంత్ నాయర్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భార్య టార్చర్ చేసినందు వల్ల ప్రశాంత్ నాయర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎలాంటి ఆరోపణలు లేవని పోలీసులు చెప్పడం గమనార్హం.