మనకు తెలియకుండానే మన డబ్బులు పెద్ద మొత్తంలో పోతే చాలా బాధపడుతుంటాం. అవి దొరికే వరకూ వెతుకుతుంటాం. ఎవరైనా తీశారేమోనని అడుగుతుంటాం. అలాంటిది మనం చూస్తుండగానే మన డబ్బులు గాల్లో ఎగిరిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సులో ఓ సరదా సన్నివేశం జరిగింది.
జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి ఓ ఆర్టీసీ బస్సు జగిత్యాలకు వెళ్తోంది. బస్సులోని ప్రయాణికులందరికీ కండక్టర్ టికెట్లు ఇస్తున్నాడు. ఇంతలో ఓ ప్రయాణికురాలికి టిక్కెట్ ఇస్తుండగా.. రూ.500 నోటు కండక్టర్ చేతిలో నుంచి గాల్లోకి ఎగిరిపోయింది. బస్సు అద్దాల నుంచి గాల్లోకి ఎగురుతూ బయటపడింది. దీంతో కండక్టర్ తో పాటు ప్రయాణికురాలు కూడా కంగారు పడ్డారు. అయ్యయ్యో అంటూ గట్టిగా కేకలు వేసి, డ్రైవర్ కు చెప్పి బస్సును రోడ్డు పక్కనే నిలిపి వేయించారు.
డ్రైవర్ తో పాటు కొందరు ప్రయాణికులు కూడా కిందకు దిగారు. దాదాపు ఐదు నిమిషాల పాటు రూ.500 నోటు కోసం చెట్ల పొదల్లో వెతికారు. చివరకు రూ.500 నోటు దొరకడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటూ... నవ్వుతూ మళ్లీ బస్సెక్కారు. దేవుడి దయతో నా 500 రూపాయలు దొరికాయి అంటూ సదరు ప్రయాణికురాలు సంతోషపడింది. ఈ ఘటనపై బస్సులో ప్రయాణికులు తలో విధంగా ఛలోక్తులు విసురుకుని.. కాసేపు నవ్వుకున్నారు.