స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండలో వ్యవసాయ భూమిని తన పేరుపై పట్టా చేయనందుకు 12 రోజుల కింద మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందుతాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ప్రైవేట్ హస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. సీఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడమ ప్రవీణ్(23) తన బంధువైన ఎడమ గట్టయ్య ఇంటికి బాల్యంలో దత్తత వెళ్లాడు.
దత్తత తల్లిదండ్రులకు చెందిన వ్యవసాయ భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి పట్టా పాసుబుక్కు అందజేయాలని కొన్ని నెలలుగా ప్రవీణ్ కోరుతున్నాడు. దత్తత తల్లిదండ్రులు ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తుండడంతో జులై 4న ఇంట్లో గొడవచేశాడు. దత్తత తల్లిదండ్రులు ససేమిరా అనడంతో మనస్తాపంతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందుతాగాడు.
చికిత్స కోసం గ్రామస్తులు హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.