అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు

  •     అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం
  •     కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్  డ్రైవర్
  •     మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు
  •     హనుమకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం
  •     ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం

ఆత్మకూరు(దామెర), వెలుగు:  పుట్టిన బిడ్డను భారమనుకుందో ఏమో.. ఓ తల్లి ఒక్కరోజు గడవక ముందే తన పసికందును భూమిలో పాతిపెట్టింది. ప్రాణాలతోనే మట్టిలో పూడ్చిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోగా.. ఎండ, మట్టి వేడికి ఆ పసిగుడ్డు తల్లడిల్లిపోయింది. కాసేపటికి భూమి లోపల కదులుతున్న ఆనవాళ్లను గమనించిన ఓ ట్యాంకర్​ డ్రైవర్  స్థానికులకు సమాచారం అందించడంతో అక్కడున్న మహిళలు మట్టిని తోడి చిన్నారిని బయటకు తీశారు. ఈ హృదయ విదారక ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ శివారులో శనివారం ఉదయం జరిగింది. 

ప్రత్యక్ష్య సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పుడే ఓ పుట్టిన ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఊరుగొండ శివారు నేషనల్​ హైవేకు సమీపంలో పాతిపెట్టారు. ఈ క్రమంలో రోడ్డు పనుల కోసం ట్యాంకర్​ తో నీళ్లు సప్లై చేస్తున్న రామ్​ దినయ్​ అనే ట్యాంకర్​ డ్రైవర్​ తన లారీని ఆపి  విశ్రాంతి తీసుకుంటున్నాడు. పక్కన భూమిలో కదలికను  గమనించాడు. వెంటనే అక్కడికి వెళ్లి మట్టిని తోడి చూడగా శిశువు కనిపించింది. అక్కడికి కొద్ది దూరంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలకు సమాచారం చేరవేశాడు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో అందరూ హుటాహుటిన అక్కడికి చేరుకుని పసిగుడ్డును బయటకు తీశారు. ఉపాధి కూలీలు, దామెర ఎస్​ఐ అశోక్​ చిన్నారికి సపర్యలు చేసి, శరీరంపై ఉన్న మట్టిని శుభ్రం చేశారు. అనంతరం చిన్నారిని స్థానిక ఎన్ఎస్ఆర్​ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందించడంతో పసికందు ప్రాణాలతో బయటపడింది.

నిజంగా మృత్యుంజయురాలు

ఓ వైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఆ వేడితో పాటు  భూమిలో పాతిపెట్టినా చిన్నారి బతికి బయటపడడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కన్నతల్లి వద్దనుకున్నా.. భూమాత కాపాడిందని తెలిపారు. కాగా పసికందును శనివారం ఉదయం నార్మల్  డెలివరీలో పుట్టిన ఆడశిశువు గా డాక్టర్లు గుర్తించారు. శిశువుకు బొడ్డుపేగు కూడా తొలగించి ఉండకపోవడం, ఆసుపత్రిలో అడ్మిట్​ అయిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో బయటే నార్మల్​ డెలివరీ అయి ఉంటుందని పోలీసులు, వైద్యాధికారులు  భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.