గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంలో టపాసులు కాల్చటంపై నిషేధం

గణేష్ ఉత్సవాల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి బహిరంగ ప్రదేశాల్లో పటాకులు పేల్చడంపై నిషేధం విధించారు. ఈ ఆదేశాలు సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో పటాకులు పేల్చడం, కాల్చడం పూర్తిగా నిషేధమని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం (సెప్టెంబర్ 11న) ప్రకటించారు. నగర పౌరులందరూ ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపులు చేసుకోవాలని, శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

గ్రేటర్ హైదరాబాద్ లో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జం తేదీ, మిలాద్ ఉన్ నబీ పండుగలు సెప్టెంబర్ 28వ తేదీనే వచ్చాయి. అందువల్ల రెండు ఉత్సవాలు ఒకేసారి ఉండడంతో పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అయితే.. గణేష్ నిమజ్జం తేదీ నిర్ణయించారు. కానీ, మిలాద్ ఉన్ నబీ తేదీ మాత్రం ఇంకా నిర్ణయించలేదు.

హైదరాబాద్‌లో శాంతి భద్రతల కోసం.. సీరత్-ఉన్-నబీ అకాడమీ, మర్కాజి అంజుమన్ ఇ ఖద్రియా, సున్నీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఇండియాతో సహా పలు మత సంస్థలు ఈ ఏడాది మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాయి. మసీదులను సందర్శించడం, పేదలకు సహాయం చేయడం ద్వారా మిలాద్ ఉన్ నబీని జరుపుకోవాలని నిర్ణయించారు.