కర్నాటకలో కొనసాగుతున్న బంద్

కర్నాటకలో బంద్ కొనసాగుతోంది. పలు చోట్ల ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి.  కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ..ఆందోళన చేస్తున్నారు. కావేరి జలాలను తమిళనాడుకు నిరంతరంగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాల ఐక్యకూటమి ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు మద్దతు పెరుగుతోంది. బంద్‌కు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, జేడీఎస్‌, ఆప్‌తోపాటు దాదాపు అన్ని ప్రజాసంఘాలు, రైతు పోరాట కమిటీలు, పర్యావరణ పోరాట సంస్థలు మద్దతు పలికాయి. 

కావేరీ జలాలతో పాటు ఉత్తర కర్ణాటకలో మహాదాయి నీటి కోసం పోరాటం చేసే రైతు సంఘాలు, ఆల్మట్టి ఎత్తు పెంచాలని డిమాండ్‌ చేసే విజయపుర, బాగల్కోటె ప్రాంత రైతు ప్రతినిధులు కూడా రాష్ట్ర బంద్ కు మద్దతు ప్రకటించారు. మండ్య, మైసూరు, రామనగర్‌ ప్రాంతాల్లో ఇప్పటికే నిరసనలు తారస్థాయికి చేరాయి. బంద్‌ నేపథ్యంలో విద్యాసంస్థలకు సిద్ధరామయ్య ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 

కర్ణాటక బంద్‌కు పిలుపునివ్వడంతో గురువారం (సెప్టెంబర్ 28) అర్ధరాత్రి 12 గంటల నుంచే బెంగళూరు సహా అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో 144 సెక్షన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2016 కావేరి గొడవల వేళ విధ్వంసం నేపథ్యంలో పలువురిని ముందుగానే అదుపులోకి తీసుకునేలా అన్ని పోలీసుస్టేషన్ల వారిగా చర్యలు చేపట్టారు. బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించాలని భావించినా అందుకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఏ ఐదుగురు వ్యక్తులు గుంపుగా తిరగరాదనే ఆదేశాలు జారీ చేశారు. 

బెంగళూరు పరిధిలో 16 వేల మంది పోలీసులను నియమించారు. ఇక ఆసుపత్రులు, మెడికల్‌షాపులు, అంబులెన్స్‌లు, యథావిధిగా పని చేస్తున్నాయి. ఆటో, క్యాబ్‌, మినీవ్యాన్‌, మాల్స్‌, సినిమాహాళ్లు, బేకరీలు, హోటళ్ళు పూర్తిగా మూసి వేశారు. చలనచిత్ర వాణిజ్య మండలి బంద్‌కు మద్దతు తెలిపింది. ప్రైవేటు విద్యాసంస్థల సంఘం రుప్సా బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చింది. స్వచ్ఛంగా విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో బీఎంటీసీ, కేఎఎస్ ఆర్టీసీ సహా నాలుగు కార్పొరేషన్ల ఉద్యోగులు అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. డ్రైవర్లు, కండెక్టర్లు సంబంధిత డిపోలలో ఉండాలని తెలిపారు. తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయడంపై హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌ స్పందించారు. కావేరి జలాల విడుదలపై రాష్ట్ర బంద్‌ అవసరం లేదన్నారు. కోర్టు తీర్పు పాటించాల్సి ఉంటుందన్నారు. పోరాటాలు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అన్నారు. నిరసనలు చేయవచ్చునని, కానీ బంద్‌ అవసరం లేదన్నారు.