
- చేర్యాలలో పల్లాకు నిరసన సెగ
- రెవెన్యూ డివిజన్ సంగతి ఏమైందంటూ నిలదీత
- గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన జేఏసీ
- జేఏసీ లీడర్లతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
- వెనుదిరిగి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ
- నాలుగు మండలాల బంద్ ప్రశాంతం
చేర్యాల, వెలుగు : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. రెవెన్యూ డివిజన్ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల సబ్‌డివిజన్‌లోని నాలుగు మండలాల్లో బంద్నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పల్లాకు బీఆర్ఎస్ జనగామ సీటు కన్ఫామ్కావడంతో ఆయన కొమురవెల్లిలో పూజలు చేసి అక్కడి నుంచి జనగామ వరకు బైక్‌ర్యాలీ తీశారు. అయితే, చేర్యాలకు చేరుకోగానే జేఏసీ నేతలు, ప్రజలు పల్లా గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దీంతో నిరాహార దీక్షల దగ్గరకు వచ్చిన ఆయనను జేఏసీ నేతలు అడ్డుకున్నారు.
ఎన్నో ఏండ్లుగా రెవెన్యూ డివిజన్‌కోసం పోరాడుతుంటే పట్టించుకోలేదని..ఇప్పుడు కోడ్వచ్చాక రావడం ఏమిటని నిలదీశారు. ఏడేండ్లుగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నా ఒక్కసారి కూడా ఈ ప్రాంత సమస్యలపై గాని, జేఏసీ ఉద్యమం గురించిపై గాని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్టికెట్వస్తదని, సీఎంను ఒప్పించి రెవెన్యూ డివిజన్జీఓ తీసుకువస్తానని ఎన్నోసార్లు ప్రకటించి ఇప్పుడు ఉత్తచేతులతో ఎందుకు వచ్చావని అడిగారు. జిల్లాలో కలిపి చేర్యాలను ముక్కలు చెక్కలు చేశారని ఆరోపించారు. దీంతో వారిని పల్లా సముదాయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయంలో బీఆర్ఎస్, జేఏసీ లీడర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. చేసేదేమీలేక పల్లా వెళ్లిపోయారు.
చేర్యాల బంద్ సంపూర్ణం...
మరోవైపు చేర్యాలను డివిజన్చేయాలంటూ నాలుగు మండలాల బంద్‌కు పిలుపునివ్వగా సక్సెస్అయ్యింది. హోటళ్లు, వర్తక వాణిజ్య సంస్థలు, వ్యాపార వర్గాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ బంద్‌కు సహకరించారు. అన్ని మండలాల కూడళ్లలో ఉద్యమ జేఏసీ నేతలు ఆందోళన నిర్వహించారు.