బెళగావి: కర్నాటకలోని బెళగావిలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు బ్యానర్ కలకలం రేపింది. బెళగావిలోని సాహు నగర్లో గుర్తుతెలియని వ్యక్తులు మెయిన్ రోడ్డు పక్కనే ఔరంగజేబు బ్యానర్ ఏర్పాటు చేశారు. సుల్తాన్-ఎ-హింద్, ది రియల్ ఫౌండర్ ఆఫ్ అఖండ్ భారత్ అని ఈ బ్యానర్లో ఔరంగజేబును ఆకాశానికెత్తేశారు.
ఔరంగజేబు జయంతి సందర్భంగా ఈ బ్యానర్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ పోస్టర్ బెళగావిలోని రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఘర్షణలు చెలరేగే విధంగా కుట్ర పన్ని ఈ బ్యానర్ను ఎవరో దురుద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశారని స్థానికులు మండిపడ్డారు.
పోలీసులు ఈ బ్యానర్ను తొలగించి, బెళగావిలో భద్రత పెంచారు. అయితే.. ఔరంగజేబు బ్యానర్ తొలగించడంపై కొందరు యువకులు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేశారు. వీర్ సావర్కర్ బ్యానర్ ఉంచి, ఔరంగజేబు బ్యానర్ తొలగించడం ఏంటని ప్రశ్నించారు. ఈ బ్యానర్ తొలగించిన ఘటనను ఊరికే వదలమని హెచ్చరించారు. ఆన్లైన్లో కనిపించిన ఈ పోస్టులు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.