భద్రాద్రి జిల్లాలో కొత్త మండలాల నినాదం

భద్రాచలం,వెలుగు:  జిల్లాలో కొత్త మండలాల నినాదం ఊపందుకుంది. ఇల్లందు మండలంలోని కొమరారం, టేకులపల్లి మండలంలోని బోడు, అశ్వాపురం మండలంలోని మొండికుంటలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ పోరాటం చేస్తున్నారు. ఇల్లందు రెవెన్యూ డివిజన్​ను నెలకొల్పాలని కోరుతున్నారు. స్థానిక ప్రజలతో పాటు ఆల్​పార్టీ నేతలు కలిసి రావడంతో ఉద్యమం తీవ్రమవుతోంది. పోరాటంలో భాగంగా సోమవారం నుంచి మండలాల సాధన సమితి దీక్షలు చేపట్టింది. మొండికుంట మండలం ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు సీఎస్​కు లేఖ కూడా రాశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఆరు మండలాలు ఏర్పడగా, తాజాగా మరో మూడు మండలాలు ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్​ చేస్తున్నారు. 

మండల కేంద్రాలకు దూరంగా పల్లెలు

ప్రస్తుతం అశ్వాపురం మండలంలో 24 గ్రామపంచాయతీల్లో  40 వేల జనాభా ఉంది. ఈ మండలంలోని మొండికుంట, మల్లెలమడుగు, నెల్లిపాక, రామచంద్రాపురం, తుమ్మలచెర్వు, ఆనందాపురం, వెంకటాపురం, నెల్లిపాక బంజర పంచాయతీల్లోని పల్లెలు మండలకేంద్రానికి దూరంగా అటవీప్రాంతంలో ఉన్నాయి. ఈ పంచాయతీల్లో18 వేల జనాభా ఉండడంతో చిన్నపాటి పనుల కోసం మండలకేంద్రానికి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. వీటిలో 8 పంచాయతీలు మొండికుంటకు దగ్గరగా ఉండడంతో కొత్త మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇల్లందు మండలంలో 29 పంచాయతీల్లో ఉంటే 57,302 జనాభా ఉంది. ఇక్కడ కొమరారం, మాణిక్యారం, మర్రిగూడెం, పోలారం, బోయతండ, పోచారం తండా, మసివాగు, ముత్తారపుకట్ట, కొమ్ముగూడెం పంచాయతీల్లోని 15,175 మంది జనాభా ఉంటుంది. కొమరారం దగ్గర్లో ఉండే ఈ పంచాయతీలను కలిపి కొమరారం మండలం ప్రకటించాలని డిమాండ్​ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి ప్రజలు బంద్, ర్యాలీలు నిర్వహించారు.

టేకులపల్లి మండలంలో 36 గ్రామపంచాయతీలు ఉండగా, 55వేల జనాభా ఉంది. రామచంద్రపేట, పెట్రాంచెలక, కొప్పురాయి, బర్లగూడెం, ఒడ్డుగూడెం, బోడు, కిష్టారం, గంగారం, లచ్చగూడెం, ఎర్రాయిగూడెం, చింతోనిచెలక, మేళ్లమడుగు తదితర 12 పంచాయతీల్లోని 20 వేల జనాభాకు మండల కేంద్రం దూరంగా ఉంది. పరిపాలనాసౌలభ్యం కోసం ఈ పంచాయతీలను కలిపి బోడు కేంద్రంగా మండలం ప్రకటించాలని డిమాండ్​ చేస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెంలో జిల్లాలో మరో మూడు కొత్త మండలాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు చేస్తున్న ఆందోళనలకు అన్ని రాజకీయ పార్టీలు  మద్దతు తెలుపుతున్నాయి. 

ఇల్లందును రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలి

గతంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత పాల్వంచ డివిజన్​ను రద్దు చేసి ఖమ్మం జిల్లాలో కొత్తగా కల్లూరు డివిజన్​ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భద్రాచలం, కొత్తగూడెం డివిజన్లే ఉన్నాయి. ఇల్లందు, గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, టేకులపల్లి, కొత్తగా కొమరారం, బోడు మండలాలను ప్రకటించి ఇల్లందు రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేయాలని ఆల్​పార్టీ నేతలు కోరుతున్నారు. 

సాధన కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల దీక్ష 

ఇల్లందు: రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని ఇల్లందు రెవెన్యూ డివిజన్​  సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జగదంబాసెంటర్​లో రెండు రోజుల దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే  గుమ్మడి నర్సయ్య దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఇల్లందును రెవెన్యూ డివిజన్  చేయాలని డిమాండ్​ చేశారు. కమిటీ కన్వీనర్ అబ్దుల్ నబి, వివిధ పార్టీల నేతలు లక్కినేని సురేందర్, యాకయ్య, ఏపూరి బ్రహ్మం, ముద్రగడ వంశీ దీక్షలో పాల్గొన్నారు. దీక్షకు ప్రముఖ వైద్యుడు శంకర్​ నాయక్, కొమురారం ఎంపీటీసీ అజ్మీరా బిచ్చు సంఘీభావం ప్రకటించారు.

కొత్త మండలాలను ఏర్పాటు చేయాలి

పరిపాలనా సౌలభ్యం కోసం మొండికుంట, బోడు, కొమరారం మండలాలు ఏర్పాటు చేయాలి. ఇల్లందు రెవెన్యూ డివిజన్​ కూడా అవసరమే. గిరిజన గ్రామాలకు దగ్గర్లోనే ఆఫీసర్లు ఉండేలా చూడాలి. ప్రజల ఉద్యమాలకు కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుంది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లాం.

- పొదెం వీరయ్య, డీసీసీ ప్రెసిడెంట్, భద్రాద్రికొత్తగూడెం

సీఎస్​కు లేఖ రాసిన

మొండికుంట మండలం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే సీఎస్​కు లేఖ కూడా రాశాను. ప్రజల డిమాండ్​ను ప్రభుత్వం పరిశీలిస్తుంది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేసేందుకు నా వంతు కృషి చేస్తాను. 

- రేగా కాంతారావు, ప్రభుత్వ విప్,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు