శ్రీశైలం శిఖరేశ్వరం చెక్​ పోస్టు దగ్గర ఎలుగుబంటి కలకలం

నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ పక్కనే ఉన్న అడవిలో ఎలుగుబంటి ప్రత్యేక్షమైంది. రోడ్డుపక్కన యాత్రికులు పడేసిన కొబ్బరి చిప్పలను తినేందుకు వచ్చిన ఎలుగుబంటి యాత్రికుల కంటపడింది. ఎలుగుబంటిని చూసిన యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. జనాలు సంచరించే ప్రదేశంలోకి ఎలుగుబంటి రావడమేంటని యాత్రికులు షాక్ అయ్యారు

 రాత్రి సమయం కావడంతో ఎలుగుబంటి అడవి నుంచి రోడ్లపైకి వచ్చినట్లు తెలుస్తోంది. దాని గమ్యానికి చేరుకునేందుకు రోడ్లపై వచ్చే వాహనాలను సైతం లెక్కచేయకుండా సంచరిస్తున్నట్లు చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఘాట్ రోడ్లపై కార్లు వెళ్తున్నప్పటికీ ఎలుగుబంటి మాత్రం దానంతట అది రోడ్డుకు అడ్డంగా వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. వేసవికాలం కావడంతో మంచినీరు, ఆహారం కోసం జంతువులు ఇలా రోడ్డు క్రాసింగ్ చేస్తూన్నట్లు గుర్తించారు అధికారులు. అయితే శ్రీశైలం వచ్చి వెళ్లే భక్తులు, యాత్రికులు, పర్యాటకులు అడవిమార్గంలో అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. శిఖరేశ్వరం వద్ద ఎలుగుబంటిని చూసిన యాత్రికులు వారి సెల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు. ప్రస్తుతం ఎలుగుబంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.