అగ్రనేతల ఇలాకాల్లో బీసీల బిగ్​ఫైట్!

  •     బీఆర్ఎస్​, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఏఐఎఫ్‌బీ నుంచి బరిలోకి..
  •     జగదీశ్,  ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి, సునీత సెగ్మెంట్లలో గట్టి పోటీ  
  •     తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన ఆయా సామాజిక వర్గాల క్యాడర్​

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం ఆగ్రనేతలు, బీసీ అభ్యర్థులకు నడుమ బిగ్​ఫైట్​జరుగుతోంది.  ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఏఐఎఫ్‌బీల నుంచి బలమైన బీసీ క్యాండిడేట్లు బరిలో దిగడంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి జగదీశ్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటతో పాటు ఎంపీలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్​నేత జానారెడ్డి, గొంగిడి సునీత ఇలాకాల్లో బీసీ క్యాండేట్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయా పార్టీల్లోనే క్యాడర్ సైతం సామాజిక వర్గాల వారీగా చీలిపోవడంతో అగ్రనేతలకు టెన్షన్ మొదలైంది. 

ఐదు సెగ్మెంట్లలో ఆసక్తికర పోటీ

బీఆర్ఎస్​, కాంగ్రెస్​అగ్రనేతల ఆధిపత్యం నడుస్తున్న నియోజకవర్గాల్లో బీసీ లీడర్లు తలపడుతుండడం ఆసక్తిగా మారింది. నాగార్జున సాగర్‌‌లో జానారెడ్డి కొడుకు జయవీర్‌‌ రెడ్డితో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్,  కోదాడలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి భార్య పద్మావతితో మరో సిట్టింగ్ ఎమ్మెల్యే  బొల్లం మల్లయ్య యాదవ్ పోటీ పడుతున్నారు.  

ఎంపీ కోమటి రెడ్డి పోటీ చేస్తున్న నల్గొండలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పిల్ల రామరాజు యాదవ్, బీజేపీ నుంచి గౌడ సామాజిక వర్గానికి చెందిన మాదగాని శ్రీనివాస్ గౌడ్ బరిలో దిగారు.  సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌పై బీఎస్పీ నుంచి వట్టె జానయ్య యాదవ్, ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌‌ రెడ్డిపై బీజేపీ నుంచి మున్నూరుకాపు వర్గానికి చెందిన పడాల శ్రీనివాస్​, కాంగ్రెస్‌ నుంచి యాదవ వర్గానికి చెందిన బీర్ల ఐలయ్య పోటీకి దిగారు. 

బీసీల ఓట్ల చీలికపైన ప్రధాన పార్టీల్లో టెన్షన్​..

బీసీ అభ్యర్థుల పోటీ కారణంగా ఆ వర్గం ఓట్లు చీలే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఐదు నియోజకవర్గాల్లో యాదవ, గౌడ సామాజిక వర్గంతో పాటు మున్నూరు కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ ప్రభావం ఎవరి పైన పడుతుందో తె లుసుకునేందుకు ఆయా పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి.  ఏవర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతున్నారు..?  అసలు బీసీ అభ్యర్థుల పోటీ పైన ప్రజల స్పందన ఎలా ఉంది..? అనే అంశాల పైన పార్టీలతో సహా, ఇంటిలిజెన్స్​వర్గాలు ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి.  

ముఖ్యంగా బీఆర్ఎస్​తిరుగుబాటు అభ్యర్థులు ఉన్న నల్గొండ, సూర్యాపేట నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. వట్టె జానయ్య, పిల్లి రామరాజు యాదవ్​ వల్ల బీఆర్ఎస్​కు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ సర్వేలు చెప్తుండగా, పార్టీ నుంచి వాళ్లు వెళ్లిపోవడం వల్ల తమకే మేలు జరుగుతుందని బీఆర్ఎస్​ సర్వే లు స్పష్టం చేస్తున్నాయి.     

అగ్రనేతలకు ధీటుగా ప్రచారం​...

అగ్రనేతలకు ధీటుగా బీసీ క్యాండిడేట్లు ఎన్నికల ప్రచారం స్పీడప్​చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించడంతో పాటు  ప్రచార రథాలు, బైక్​ ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు.  వాట్సప్​ గ్రూపులు క్రియేట్​ చేసి అన్ని వర్గాల ప్రజలను ఆ కట్టుకునేవిధంగా పోస్టులు పెట్టడంతో పాటు పాంప్లేట్స్​, వాల్​ పోస్టర్లుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

అన్ని గ్రామాల్లో తమకు సపోర్ట్​ చేస్తున్న యూత్​ విభాగాలతో ప్రత్యేక గ్రూప్​లు తయారు చేసి బూత్​ ఏజెంట్లను పెట్టుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో తమ పర్యటన అనంతరం ప్రజల్లో జరుగుతున్న చర్చ గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. నల్గొండ, ఆలేరులో అభ్యర్థులు పల్లె నిద్ర కూడా చేస్తున్నారు.