ఈ పక్షి రెండు రూల్స్ బ్రేక్ చేసి, రికార్డ్ సృష్టించింది. అవేంటంటే.. ఒకటి దాని జీవితకాలం. మరొకటి లేటు వయసులో గుడ్డు పెట్టడం. ఈ రెండు విషయాల్లో తనకు తానే సాటిగా నిలిచింది సముద్ర పక్షి. దీంతో ఈ విషయం తెలిసి జంతు పరిశోధకులు కూడా ఆశ్చర్యపోయారు.
విస్డమ్.. లేసాన్ ఆల్బట్రాస్ అనే పక్షి జాతికి చెందింది. విస్డమ్ను ఆరేండ్ల వయసులో1956లో అమెరికా జియోలాజికల్ సర్వే ఆఫీసర్లు మొదటిసారి కనుగొన్నారు. అప్పటి నుంచి హవాయి ద్వీపాల్లో నివసిస్తోంది. ఎక్కువగా సముద్ర ప్రయాణాలు చేసే ఆల్బట్రాస్ పక్షులు సాధారణంగా ఒకే పక్షితో సావాసం చేస్తాయి.
అలాగే.. విస్డమ్, అకేకామై అనే మగ పక్షితో కలిసి పసిఫిక్ సముద్ర ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. ఒకసారి సముద్రానికి వెళ్లిన అకేకామై తిరిగి రాలేదు. దాంతో చాలా ఏండ్లు విస్డమ్ ఒంటరిగా ఉండేది. కొంతకాలం నుంచి విస్డమ్ మరో మగపక్షితో సావాసం చేయసాగింది. ఫలితంగా ఈ ఏడాది గుడ్డు పెట్టింది. మొత్తంగా లైఫ్టైంలో గుడ్డు పెట్టడం 60వ సారి. సాధారణంగా... ఈ పక్షులు ఏడాదికి ఒక్క గుడ్డు మాత్రమే పెడతాయి.
గుడ్డు పెట్టిన తర్వాత సముద్ర విహారానికి వెళ్తాయి. దీంతో గుడ్డు పొదిగే బాధ్యత మగ పక్షి తీసుకుంటుంది. గుడ్డును పొదగడానికి దానిపై 66 రోజుల పాటు కూర్చుంటుంది. ఇకపోతే ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ పక్షుల జీవితకాలం 68 ఏండ్లే. కానీ, విస్డమ్ ప్రస్తుత వయసు 74 ఏండ్లు. ఈ వయసులో బతికి ఉండడం, ఆరోగ్యంగా ఉండి గుడ్డు పెట్టడం అనేది అసాధారణ విషయం అని అంతా ముక్కన వేలేసుకుంటున్నారు. ఇప్పటివరకు విస్డమ్ పెట్టిన గుడ్లలో 30 పిల్లలు వచ్చాయని, ఇప్పుడు పెట్టిన గుడ్డు ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటున్నట్టు పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ తెలిపింది.