- కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
అసోం : అసోం రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ధుబ్రి జిల్లాలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా పడి.. ఏడుగురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో సుమారు 30 మందితో పడవ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన పడవలో ప్రభుత్వ అధికారి, పాఠశాల విద్యార్థులు సహా పలువురు ప్రయాణం చేస్తునట్టు తెలుస్తోంది. విషయం తెలియగానే SDRF, BSF బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. నదిలో గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోందని ధుబ్రి డిప్యూటీ కమిషనర్ అన్బముతన్ చెప్పారు. పడవలో 10 టూవీలర్స్ ను ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రమాద సమయంలో ధుబ్రి సర్కిల్ అధికారి సంజు దాస్, ల్యాండ్ రికార్డ్ అధికారితో పాటు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారి ఉన్నారు. సంజు దాస్ గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరు ప్రభుత్వ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాలకు కోతకు గురైన ప్రాంతాన్ని సర్వే చేసేందుకు అధికారులు.. స్థానికులతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.