
- ఒకరికి అమ్మి మరొకరికి
- రిజిస్ట్రేషన్ చేస్తుండగా.. తహసీల్దార్ ఆఫీస్ ముందే గొడవ
- బౌన్సర్‌తో దాడి చేయించిన రియల్టర్
- పోలీసుస్టేషన్ కు చేరిన పంచాయితీ
చేవెళ్ల, వెలుగు : తహసీల్దార్ ఆఫీసు ముందు ఓ బౌన్సర్ అయిదుగురిపై దాడి చేసి వీరంగం సృష్టించాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మండలం ఖానాపూర్ రెవెన్యూలోని సర్వే నం. 270లో మూడు ఎకరాల భూమిని బాలరాజు గౌడ్ నుంచి చేవెళ్లకు చెందిన కవాడి తిరుపతి రెడ్డి, దేవుని ఎర్రవల్లికి చెందిన రంగారెడ్డి రూ. 6 కోట్లకు కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. డబ్బులు తీసుకున్న బాలరాజు గౌడ్ మాత్రం భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా రేపూ మాపంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. గురువారం చేవెళ్ల తహసీల్దార్ ఆఫీసుకు మరో వ్యక్తికి అదే భూమిని అమ్మి రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చాడు.
దీంతో బాలరాజుగౌడ్‌ను తిరుపతిరెడ్డి, రంగారెడ్డితో పాటు మరి కొందరు అడ్డుకున్నారు. దీంతో బాలరాజుతో వచ్చిన బౌన్సర్ ఆయన చేతికున్న కడియంతో అయిదుగురిపై దాడి చేశాడు. దీంతో వారికి తలలు పగిలాయి. స్థానికులు బాలరాజు గౌడ్‌తో పాటు బౌన్సర్‌ను పట్టుకుని రూమ్‌లో బంధించారు. అనంతరం ఇరువర్గాలు శాంతి యుతంగా మాట్లాడుకుందామని ఓ ఫామ్‌హౌస్‌లోకి వెళ్లాయి. అక్కడ మాటామాటా పెరగడంతోమరోమారు దాడికి దిగాయి. బౌన్సర్‌ను స్థానికులు చితకబాదారు. అనంతరం ఇరువర్గాల పంచాయితీ స్టేషన్ కు చేరింది. పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.