తిరుపతి: తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన విషాద ఘటన మురువకముందే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శించుకునేందుకు ఫ్యామిలీతో కలిసి వచ్చిన ఓ మూడేళ్ల బాలుడు వసతి సముదాయం మీదినుంచి కింద పడి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. కడప టౌన్ చిన్న చౌక్‌కి చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈ నెల13వ తేదీన శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చారు.
శ్రీనివాసులు కుటుంబానికి టీటీడీ 16వ తేదీన దర్శన టోకెన్లను కేటాయించింది. రేపు (జనవరి 16) దర్శనం ఉండటంతో బుధవారం (జనవరి 15) తిరుమల చేరుకొని ఆర్టీసీ బస్టాండ్‌లోని పద్మనాభ నిలయంలో శ్రీనివాసులు కుటుంబం లాకర్ పొందింది. బుధవారం సాయంత్రం పద్మనాభ నిలయం వసతి సముదాయంలో శ్రీనివాసులు ఇద్దరు కుమారులు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీనివాసులు రెండో కుమారుడు సాత్విక్ ప్రమాదవశాత్తూ కాలు జారీ వసతి సముదాయం రెండవ అంతస్థు నుంచి కిందపడ్డాడు.
ALSO READ | తిరుపతిలో మంచు మనోజ్ లొల్లి : యూనివర్సిటీ దగ్గర పోలీసుల లాఠీఛార్జ్
తీవ్ర గాయాలపాలైన స్వాతిక్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాత్విక్ మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్వాతిక్ మృతిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతా మంచి జరగాలని శ్రీవారి దర్శనం కోసం వస్తే.. అదే తిరుమల సన్నిధిలో కొడుకు మృతి చెందడంతో శ్రీనివాసులు ఫ్యామిలీ కన్నీరుమున్నీరుగా విలపించింది.