కరీంనగర్ మానేర్ డ్యామ్ లో మట్టి తీసిన గొయ్యిలో పడి ఓ బాలుడు మృతిచెందడం తీవ్ర విషాదం నింపింది. కొద్ది రోజులుగా మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనుల కోసం డ్యామ్ నుంచి మట్టి తరలిస్తున్నారు. అయితే.. మట్టి తీసిన గొయ్యిలో స్నానానికి వెళ్లిన బాలుడు చనిపోయాడు. విషయం తెలియగానే స్థానిక కాంగ్రెస్ నాయకులు చనిపోయిన బాలుడి తల్లిదండ్రులను కలిశారు. ఆ తర్వాత కరీంనగర్ సివిల్ ఆస్పత్రి మార్చురీలో బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడి మృతి విషయాన్ని రహస్యంగా ఉంచారని కరీంనగర్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు అధికార పార్టీ నాయకులు, అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మానేర్ డ్యామ్ లో మట్టిని రెండు, మూడు నెలలుగా ప్రభుత్వ అవసరాల కోసమని ప్రొక్లెన్లు, టిప్పర్లు పెట్టి పెద్ద పెద్ద గుంతలు తవ్వుతున్నారు. ఇదే గుంతలో ఉరుసు అరవింద్ ఆదివారం (జూన్ 18వ తేదీన) గుంతలో పడి చనిపోయాడు. బాలుడు చనిపోయి 24 గంటలు గడుస్తున్నా బయటకు తెలియనీయకుండా చూస్తున్నారని కాంగ్రెస్ నగర శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అరవింద్ మరణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, తల్లిదండ్రులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాకు చెందిన బాలుడి తల్లిదండ్రులు ఐదేళ్లుగా కరీంనగర్ లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. అరవింద్ చనిపోయిన తర్వాత అధికారులు ఎలాంటి పరిహారం చెల్లించలేదని తెలుస్తోంది. కేవలం తోటి కార్మికులు తలా వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందించి.. బాలుడి డెడ్ బాడీని స్వస్థలం ఖమ్మం జిల్లాకు తరలించారు.
బాలుడు కూడా మట్టి తవ్వే ఓ జేసీబీ దగ్గర పని చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన జేసీబీ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మట్టి తీయడం వల్ల ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలలో ఈతకు వెళ్లే పిల్లలు ఇటువంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.