ప్రేమ పేరుతో వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మార్చి 20 సోమవారం చికిత్స పొందుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందింది. వివరాల్లోకెళితే.. మార్చి 18 వ తేదీన సాయంత్రం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంబడి సాయిష్మా అనే అమ్మాయిని అదే గ్రామానికి చెందిన నలిమేల వినయ్ కుమార్ ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలని పదేపదే వేధింపులకు గురి చేశాడు. తనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందని నన్ను టార్చర్ చేయొద్దని సాయిష్మా కోరిన వినలేదు వినయ్. తనను ప్రేమించకపోయినా.. పెళ్లి చేసుకోకపోయినా.. నీ సంగతి చూస్తాను అని ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేశాడు.
నువ్వు చచ్చిపో అంటూ ఫోన్లు చేసి టార్చర్ పెడుతూ అరాచకానికి పాల్పడేవాడు నలిమేల వినయ్ కుమార్. అతడి వేధింపులు తట్టుకోలేక మనస్థాపానికి గురై సాయిష్మా గత శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రి తీసుకువచ్చారు. కరీంనగర్ నుండి మెరుగైన చికిత్సకు హైదరాబాద్ నిమ్స్ తీసుకొచ్చారు. సాయిష్మ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 20 సోమవారం మృతి చెందింది. వినయ్ కుమార్ వల్లే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వినయ్ పై తగిన చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని కోరారు.