కష్టాలు ఎదురైతే.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని మహనీయులు చెప్పిన మాటలు విని చాలా మంది స్ఫూర్తి పొందుతారు. మరొ కొందరు కష్టాల భారాన్ని మోయలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తారు. కన్నవారికి కడుపు కోత మిగుల్చుతారు. అలా జీవితం దుర్భరమై తల్లిదండ్రులకు భారం కాకూడదని ఓ బాలుడు సూసైడ్ చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం కమ్మరిపేట తండాకు చెందిన భూక్యా రాజు, జ్యోతి దంపతుల కుమారుడు దినేష్(17). కుటుంబ కలహాలు తదితర సమస్యలతో దినేష్ తరచూ మనో వేదనకు గురయ్యేవాడు.
జులై 14న తల్లి మందలించడంతో మనస్థాపానికి గురయ్యాడు. చనిపోవాలని భావించి అడవిలోకి వెళ్లి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో అతను బాధతో మాట్లాడుతూ.. 'అమ్మ, నాన్న ఆరోగ్యం బాగా చూసుకోండి. అన్న.. చెల్లె పెళ్లి బాగా చేయాలి. పెళ్లి అప్పుడు నా ఫొటోని తప్పకుండా ఉంచండి. అమ్మ కొట్టిందని బాధగాలేదు. పుడితే గొప్పింట్లో పుట్టాలి. ఇలా బతకడం నాకిష్టం లేదు. క్షమించండి అమ్మ నాన్న. నా బాడీ 15 రోజులవరకు మీకు దొరకదు' అంటూ తోటి మిత్రులను సైతం యాది చేసుకుంటూ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ వీడియో ఇప్పుడు అందర్ని కంటతడి పెట్టిస్తోంది. చేతికందివచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు బాలుడి మృతికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.