కరీంనగర్ : ఫిట్స్ వచ్చి పడిపోయిన ఓ బాలుడికి ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ చొరవతో ప్రాణాపాయం తప్పింది. ఆర్టీసీ బస్సులో ఓ మహిళ తన తొమ్మిదేళ్ల కుమారుడితో ప్రయాణిస్తుండగా ఆమె కుమారుడికి ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చాయి. దీంతో బస్సులోనే ఆ బాలుడు కింద పడిపోవడంతో ప్రయాణికులందరూ టెన్షన్ పడ్డారు. వెంటనే అప్రమత్తమైన కండక్టర్ వి.ఎల్. నారాయణ, డ్రైవర్.. బస్సును నేరుగా షా నగర్ లోని ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్స చేయించడంతో బాలుడు కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోకు చెందిన బస్సు.. పెగడపల్లి నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
సకాలంలో తమ కుమారుడిని ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి.. చికిత్స చేయించిన బస్సు డ్రైవర్, కండక్టర్ కు బాలుడి తల్లి కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స నుంచి కోలుకున్న తర్వాత తమ కుమారుడితో అదే బస్సులో కరీంనగర్ కు వెళ్లారు ఆ తల్లి. బాలుడి స్వస్థలం రామడుగు మండలం గోపాలరావుపేట. డ్రైవర్, కండక్టర్ చూపిన మానవత్వానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు వారికి అభినందనలు తెలియజేశారు.